విద్యార్థులూ.. ఇదీ పోలీస్ ‘గన్’ కీర్తి!
● ఆయుధాలు చూపించి అవగాహన
కల్పించిన ఎస్పీ దంపతులు
● ముగిసిన ఆయుధాలు,
సాంకేతిక పరికరాల ప్రదర్శన
కర్నూలు: ‘విద్యార్థులు ఇదిగో ఏకే 47 .. దూరంలో ఉన్న లక్ష్యాన్ని తునాతునకలు చేస్తుంది. ఇదిగో ఇదేమో డ్రోన్ కెమెరా.. చాలా ఎత్తుకు ఎగిరి అక్కడ జరిగే ప్రతి దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది. ఇది దిశ ఎస్‌ఓఎస్ యాప్ ... ప్రతి సెల్‌ఫోన్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆడపిల్లలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఫోన్ ఊపితే చాలు మీరు ప్రమాదంలో ఉన్నట్లు పోలీసులకు తెలిసి పోతుంది. నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకొని రక్షిస్తారు. ఇవేమో పోలీసు జాగిలాలు.. దొంగల ఆచూకీ కనుగొని పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి’ అంటూ విద్యార్థులకు ప్రతి అంశాన్ని ఎస్‌పీ దంపతులు విక్రాంత్ పాటిల్, దీపికా పాటిల్ వివరించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్‌పీ కర్నూలు 2వ పటాలం మైదానంలో కమాండెంట్ దీపికా పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోలీసులు శాంతి భద్రతలకు ఉపయోగించే ఆయుధాలు, నేర నిర్దారణకు వినియోగించే పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారు కొద్దిసేపు ఉపాధ్యాయుల్లా వ్యవహరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
కమ్యూనికేషన్స్‌పై అవగాహన
పోలీస్ శాఖ వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్స్ వ్యవస్థ, ఫోరెన్సిక్ సామాగ్రి పనితీరు తదితర వాటిపై అక్కడున్న సిబ్బంది కూడా విద్యార్థులకు వివరించారు. పిస్టల్, తుపాకీ వినియోగం, టియర్ గ్యాస్ వినియోగం, బాంబుల గుర్తింపు, వాటిని నిర్వీర్యం చేయడం, వేలి ముద్రల సేకరణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రజలు, ప్రజాప్రతినిధుల రక్షణకు ఎలాంటి ఆయుధాలు వినియోగిస్తారో వివరించారు. ఆయుధ ప్రదర్శనను వీక్షించేందుకు కర్నూలులోని పలు పాఠశాలల విద్యార్థులు వచ్చారు. డీపీఓలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఆర్ అడిషినల్ ఎస్‌పీ క్రిష్ణమోహన్, ఆర్‌ఐలు పోతుల రాజు, జావేద్, నారాయణ తదితరులు పాల్గొనగా, ఏపీఎస్‌పీ 2వ పటాలంలో ఇంచార్జీ అదనపు కమాండెంట్ నాగేంద్రరావు, మహబూబ్ బాషా, అసిస్టెంట్ కమాడెంట్లు రవికిరణ్, డీవీ రమణ, వెంకట శివుడు, రిజర్వు ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.
విద్యార్థులూ.. ఇదీ పోలీస్ ‘గన్’ కీర్తి!


