నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేస్తాం
● మూడు రోజులుగా
24 కేసులు నమోదు
● రూ.1.45 లక్షలు జరిమానాలు
విధించిన అధికారులు
నంద్యాల(న్యూటౌన్): పర్మిట్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్న ప్రైవేటు బస్సులను సీజ్ చేస్తామని నంద్యాల జిల్లా రవాణా అధికారి శివారెడ్డి హెచ్చరించారు. సోమవారం డీటీఓ మాట్లాడుతూ ఇటీవల జరిగిన బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో నంద్యాల ప్రాంతంలోని ప్రధాన జాతీయ రహదారిలో మూడు రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు చేశామన్నారు. మూడు రోజుల నుంచి 14 బస్సులపై కేసులు నమోదు చేసి, ఒక బస్సును సీజ్ చేశామన్నారు. మూడు రోజుల్లో రూ.1.45 లక్షలు జరిమానా విధించినట్లు డీటీఓ తెలిపారు. కొన్ని ట్రావెల్ బస్సులకు ఒరిజినల్ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో, పరిమితికి మించి లగేజీ రవాణా, డ్రైవర్ల లైసెన్స్‌లు లేని పక్షంలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు భద్రత ప్రమాణాలు పాటించాలని, లేని పక్షంలో సీజ్ చేస్తామన్నారు.


