ఇలకై లాసం.. కార్తీక శోభితం
శ్రీశైలంటెంపుల్: ఇల కైలాసమైన శ్రీశైలక్షేత్రం కార్తీక శోభను సంతరించుకుంది. దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చా రు. వేకువజామునుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాఢవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలో పలువురు భక్తులు దీపాలు వెలిగించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అలాగే కొంతమంది భక్తులు లక్ష వత్తులు వెలిగించి నోములు నోచుకున్నారు. భక్తుల రద్దీ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శ్రీస్వామిఅమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థాన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు బిస్కెట్లు, అల్పాహారం అందించారు.
కమనీయం..లక్షదీపోత్సవం
కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజాదికాలు నిర్వహించారు. అలాగే లక్షదీపోత్సవ కార్యక్రమంలో భాగంగా పుష్కరిణి ప్రాంగణమంతా లక్ష దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వీరన్నస్వామి, మార్కండేయశాస్త్రి ఇచ్చారు. భక్తులు హారతులను కనులారా తిలకించి స్వామిఅమ్మవార్లను దర్శించి నేత్రానందభరితులయ్యారు. ఈ పూజా కార్యక్రమాల్లో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు పాల్గొన్నారు.
మొదటి సోమవారం భక్తులతో
కిటకిటలాడిన శ్రీగిరి
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
నేత్రానందభరితంగా లక్షదీపోత్సవం,
పుష్కరిణికి దశవిధ హారతులు
ఇలకై లాసం.. కార్తీక శోభితం


