కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
కొలిమిగుండ్ల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. బెలుం గుహల ఆవరణలోని మీటింగ్ హాల్‌లో మూడు రోజుల పాటు జిల్లా స్థాయి శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఈశ్వరయ్యను ముందుగా రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికై నందుకు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రైతులకు ఏ పంటకూ గిట్టు బాటు ధర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని ఉల్లి రైతులకు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాక ముందు, వచ్చిన తర్వాత చెప్పిన మాటలకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఒకే సారి రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. భూ బ్యాంక్ అంటూ ప్రతి నియోజకవర్గంలో లక్షల ఎకరాలు సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు శ్రీకారం చుడుతున్నారన్నారు. రాజధానికి సమీపంలోనే ఎయిర్‌పోర్టులు ఉన్నా కొత్తగా కట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ప్రధాని ఎజెండాను మోస్తున్నారని విమర్శించారు. రూ.6,400 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నా యని గుర్తు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తుండటం దుర్మార్గమన్నారు. రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యేలు పోర్టుల ద్వారా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వీడటం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై సీపీఐ నిర్విరామంగా పోరాటం సాగిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు,రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి రంగమనాయుడు, మండల రైతు సంఘం నాయకులు పుల్లయ్య, పెద్దయ్య, వేణుగోపాల్‌రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కు
అప్పగించడం దారుణం
ప్రభుత్వ భూములు కార్పొరేట్
సంస్థలకు ధారాదత్తం


