జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హులైన మైనారిటీ యువతకు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఓఎంసీఏపీ, ఐసీఎస్ సహకారంతో జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్ పోర్టల్ https://naipunyam.ap.gov.in/userలో నవంబర్ 2లోగా నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ(2 సంవత్సరాలు) లేదా డిప్లొమా (3 సంవత్సరాలు) పూర్తి చేసి ఉండాలన్నారు. వయస్సు గరిష్టంగా 30 సంవత్సరాలు, ఎలక్ట్రీషియన్‌గా కనీసం రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలన్నారు. జీతం నెలకు రూ.2600 నుంచి రూ.2,700 యూరోలు ( దాదాపు రూ.2.60 లక్షల నుంచి రూ.2.70 లక్షలు ) ఉంటుందని, ఎంపికై న వారికి రెండేళ్లు ఒప్పందం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9988853335, 8712655686, 8790118349, 8790117279 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
పది క్వింటాళ్ల పత్తి దగ్ధం
కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళంలోని రైతు జుమ్మలదిన్నె శివకు చెందిన పది క్వింటాళ్ల పత్తి సోమవారం అగ్ని ఆహుతిఅయ్యింది. మూడు రోజుల నుంచి కూలీలతో పత్తిని తీయించి సోమవారం ఉదయం పెట్రోల్‌బంక్ పక్కన హోటల్ స్థలంలో ఆరబెట్టుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడి పత్తి మొత్తం కాలిపోయింది. నెల రోజుల పాటు కురిసిన వర్షాలకు పంట చాలా వరకు కుళ్లిపోయిందని రైతు తెలిపారు. ఇప్పుడు చేతికొస్తే తేమ ఉందని ఆరబెట్టగా కాలిపోయిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు.
వేరుశనగ మిషన్ బోల్తా పడి మహిళ మృతి
పత్తికొండ రూరల్: వేరుశనగ నూర్పిడి మిషన్ బోల్తా పడి పందికోన గ్రామానికి చెందిన సరస్వతి(45) అనే మహిళ మృతి చెందారు. తన పొలంలో వేరుశనగ పంటను కోసేందుకు సోమవారం ట్రాక్టర్‌తోపాటు నూర్పిడి మిషన్ తీసుకుని వెళ్లారు. ట్రాక్టర్‌లో ఈమెతోపాటు కుమారుడు, మహిళా కూలీలు ఉన్నారు. పొలం గట్టు వెంబడి ట్రాక్టర్ వెళ్తుండగా నూర్పిడి యంత్రం బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురుకి గాయాలయ్యాయి. చుట్టుపక్కల రైతులు వీరిని చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే సరస్వతి మృతి చెందారు. మృతురాలి కుమారుడు సూరి స్వల్పంగా గాయపడగా, తీవ్రంగా గాయపడిన మరో మహిళ కూలీ వాసవి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు.
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆదోని సెంట్రల్: కోసిగి–కుప్పగల్ అర్‌ఎస్‌ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాయిసర్వేశ్వర రావు తెలిపారు. కిలోమీటరు నంబర్: 520/14–16 దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రమైన రక్త గాయాలు కావడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుని వయస్సు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. అతని వద్ద ఎలాంటి అధారాలు దొరకలేదన్నా. గుర్తు పట్ట కలిగిన వారు ఎవరైనా ఉంటే మమ్ములను సంప్రదించాలని వారు కోరారు.
జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు


