‘పోటెత్తిన’ అదనపు బాధ్యతలు
కర్నూలు సిటీ: రాయలసీమలో అత్యంత కీలకమైన జలవనరుల శాఖలో అదనపు బాధ్యతలు ఎక్కువ అయ్యాయి. దీంతో ఇంజినీర్లు రెగ్యులర్ విధులపై దృష్టిసారించలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన నీటివనరులైన కేసీ కెనాల్, ఎల్‌ఎల్‌సీ, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టుల కింద ఆరు లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ప్రధాన నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై అధికారుల ఆజామాయిషీ అంతంతం మాత్రమే ఉంది. దీంతో ప్రతి సీజన్‌లో రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఏడాదిగా ఇదే దుస్థితి
కర్నూలు ప్రాజెక్సు చీఫ్ ఇంజినీర్ విభాగంలో రెగ్యులర్ పర్యవేక్షక ఇంజినీర్లు లేరు. ఏడాదిగా ఇన్‌చార్జీల పాలన కొనసాగుతోంది. కర్నూలు సీఈ పరిధిలో కర్నూలు సర్కిల్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్–1, సర్కిల్–2, శ్రీశైలం డ్యాం నిర్వహణ విభాగాలు ఉన్నాయి. కర్నూలు సర్కిల్, ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్–2లో మినహా మిగిలిన సర్కిళ్లలో రెగ్యులర్ ఎస్‌ఈలు లేకపోవడంతో గతేడాది నుంచి ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏడాదిగా పూర్తి అదనపు బాధ్యలతోనే పాలన కొనసాగుతోంది.
పర్యవేక్షణ ప్రశ్నార్థకం
శ్రీశైలం రిజర్వాయర్ ఎస్‌ఈగా పనిచేస్తున్న శ్రీరామచంద్రమూర్తి సీఈగా పదోన్నతి పొంది కడపలో ఈ ఏడాది ఆగస్టులో రిటైర్డ్ అయ్యారు. ఖాళీ అయిన ఎస్‌ఈ పోస్టును తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తప్పని పరస్థితుల్లో గత నెల మొదటి వారంలో కర్నూలు సర్కిల్ ఎస్‌ఈగా పని చేస్తున్న బాలచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన పనితీరుపై కూటమి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. గత అనుభవాల దృష్ట్యా శ్రీశైలం డ్యాం నిర్వహణకు రెగ్యులర్ ఎస్‌ఈని నియమించకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంఽధించిన ప్రాజెక్టు పనులు, పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది.
‘కోటరీ’ అడ్డంకులు!
జలవనరుల శాఖలో పనిచేస్తున్న కొంత మంది ఇంజినీర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఓ కోటరిగా ఏర్పడ్డారు. వీరు సహచర ఇంజినీర్లను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ కోటరికి ఓ సీనియర్ ఇంజినీర్ నేతృత్వం వహిస్తున్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతుంది. ఆ శాఖలో ఏ కీలక పోస్టు ఖాళీగా ఉన్నా కోటరీలోని ఇంజినీర్లు కూటమికి చెందిన ఏ ఎమ్మెల్యే ద్వారానే కావాల్సిన పోస్టును తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జలవనరుల శాఖలో కోటరీ ఇంజనీర్ల హవా నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఓ ఇంజినీర్ సీనియార్టీ లేకపోయినా కూడా కావాల్సిన పోస్టులోకి వచ్చి పని చేస్తున్నారు. ఈ కోటరీ ఇంజినీర్లు తమను గతంలో ఇబ్బందులకు గురి చేసిన ఓ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకోకున్నారు. ఆ ఇంజినీర్ ఆధ్వర్యంలో చేసిన పనిపై విచారణ చేయించి, వేధించాలని, ఇందుకు తమకు సహకరించాలని కూటమి నేతలపై ఒత్తిడి చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
‘అదనపు’ ఇబ్బందులు ఇవీ..
● ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్–1 ఎస్‌ఈ పోస్టులో ఆవుకు రిజర్వాయర్ ఈఈగా పనిచేస్తున్న శుభకుమార్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
● తెలుగుగంగ ఎస్‌ఈ పోస్టులో కేసీ కెనాల్ ఈఈగా పనిచేస్తున్న ప్రతాప్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేసీ కెనాల్‌లో గతేడాది ఓ సీజన్‌లో ఆయకట్టుకు నీటిని అందించేందుకే నానాసోపాలు పడ్డారు. రెగ్యులర్ విధులతో పాటు అదనపు బాధ్యతలు నిర్వహణ కష్టంగా ఉందని తెలుస్తుంది.
● శ్రీశైలం ఎస్‌ఈగా కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ బాల చంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. శ్రీశైలం రిజర్వాయర్ అనేది కీలకమైంది. ఇక్కడ రెగ్యులర్ ఎస్‌ఈగా వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కర్నూలు సర్కిల్‌లో చిన్న నీటిపారుదల శాఖ, జీఆర్‌పీ, 68 చెరువుల పథకం, ఎల్‌ఎల్‌సీ పరిధిలోని ఆయకట్టు, ట్యాంకుల్లో నీటిని నింపే పనులతో పాటు, వేదావతి, ఆర్డీఎస్ పనులను తిరిగి మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. అలాంటి అదనపు బాధ్యతలతో మరింత ఇబ్బందులు రానున్నాయి.
● హంద్రీ–నీవా సర్కిల్–1 ఎస్‌ఈగా ఎల్‌ఎల్‌సీ ఈఈగా పనిచేస్తున్న పి.పాండురంగయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఆర్డీఎస్ కుడికాలువ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించారు. హంద్రీ–నీవా విస్తరణ పనులు, నీటి పంపింగ్ పెంచే పనులకే సమయం సరిపోతుంది. ఎల్‌ఎల్‌సీ ఈఈ బాధ్యతల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
● కేసీ కెనాల్ కర్నూలు డివిజన్‌కు రెగ్యులర్ డీఈఈ లేక హంద్రీ–నీవా(అనంతపురం)లో బత్తలపల్లిలో పని చేస్తున్న ప్రసాద్‌రావు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు హంద్రీ–నీవా సర్కిల్–1లో డివిజన్–2 ఈఈగా సైతం మరో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పదోన్నతులతో
రెగ్యులర్ ఎస్‌ఈ పోస్టుల భర్తీ
కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ పరిధిలో ఖాళీగా ఉన్న ఎస్‌ఈ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎఫ్‌ఏసీలతో కొనసాగుతోంది. వాటర్ రెగ్యులేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రౌండ్ స్థాయిలో అవసరమైన చోట క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి 16 మంది ఏఈఈలను డిప్యూటేషన్‌పై నియమించాం. ప్రస్తుతం వాటర్ రెగ్యులేషన్‌కు ఇబ్బంది లేదు. ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎస్.కబీర్ బాషా, జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ
జలవనరుల శాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన ఉమ్మడి జిల్లాల్లో ఐదు సర్కిళ్లు రెండు సర్కిళ్లలో మాత్రమే రెగ్యులర్ ఎస్‌ఈలు మిగిలిన సర్కిళ్లలో అదనపు బాధ్యతలతోనే సరి శ్రీశైలం డ్యాం ఎస్‌ఈ పోస్టుపై ఆసక్తి చూపని ఇంజినీర్లు కోటరి ఇంజినీర్లదే హవా!
నిర్లక్ష్యం.. నీరుగారిన ఆశయం
రాయలసీమ జిల్లాల్లోనే అత్యంత కీలకమైనది హంద్రీనీవా ప్రాజెక్ట్సు. ఈ ప్రాజెక్టు ఫేజ్–1కి రెగ్యులర్ ఎస్‌ఈ లేరు. అదనపు బాధ్యలతోనే నెట్టుకొస్తున్నారు. నాణ్యత విభాగంలో పనిచేస్తున్న ఇంజినీర్లు కొంత మంది పక్క జిల్లాల్లో నివాసం ఉంటారు. ఓ ఇంజనీర్ అతిథిగా వచ్చి 15 రోజులకు, నెలకొసారి వచ్చి పోతుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతి పొలానికీ నీరు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతన్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. సాగునీటి ప్రాజెక్టుల ఆశయమే నీరుగారిపోతోంది. జల వనరుల శాఖలో కీలకమైన సర్కిల్స్‌కు రెగ్యులర్ పర్యవేక్షక ఇంజనీర్లు లేరు. ఈఈలుగా పని చేస్తున్న వారికి అదనపు బాధ్యతలుగా ఎస్‌ఈ పోస్టులను అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి ఆ శాఖలో పని చేస్తున్న ఈఈలకు పదోన్నతులు ఇచ్చి రెగ్యులర్ ఎస్‌ఈలను నియమించాల్సి ఉంది.