ఆయుధ పాఠం
కర్నూలు: రకరకాల తుపాకులు, రైఫిళ్లు, మెటల్ డిటెక్టర్లు, రాకెట్ లాంఛర్లు, పిస్టళ్లు, మెషిన్‌గన్‌లు, అత్యాధునిక బైనాక్యులర్లు, సురక్షిత జాగిలాలు, అత్యంత నైపుణ్యత కలిగిన సిబ్బంది వెరసి జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ అధరహో అనిపిస్తోంది. పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఏటా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్ కలసి ప్రారంభించారు. రెండో రోజు సోమవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారు ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణ నుంచి నేరస్థుల కట్టడి వరకు పోలీసులు వినియోగిస్తున్న అధునాతన ఆయుధాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల రక్షణ వరకు ఎలాంటి ఆయుధాలు వినియోగిస్తున్నారు? అవి ఎలా ఉంటాయి? వాటి వినియోగం ఎలా? తదితర అంశాల గురించి విద్యార్థులకు అక్కడ విధులు నిర్వహించిన పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. ప్రదర్శనలో వివిధ రకాల రైఫిళ్లు, పిస్టోల్, గన్‌లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, డే విజన్ బైనాక్యులర్, బాంబ్ డిటెక్టర్, స్పీడ్ గన్ మిషన్, ట్రాఫిక్ సిగ్నల్ సైన్ బోర్డు, డ్రంకెన్ బ్రీత్ ఎనలైజర్ మిషన్, ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్, డ్రోన్ కెమెరాలు, వజ్ర వాహనం, ఫాల్కన్, బాంబ్ సూట్, డాగ్ స్క్వాడ్ బృందాలు వినియోగించే ఆయుధాలు ఉంచారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు పోతల రాజు, జావెద్, నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న ఇండస్ స్కూల్, బి.క్యాంప్‌లో ఉన్న బీసీ, ఎస్సీ హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో
భాగంగా ఓపెన్ హౌస్
ప్రారంభించిన అదనపు ఎస్పీలు
పోలీసు ఆయుధాలపై
విద్యార్థులకు అవగాహన
							ఆయుధ పాఠం

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
