మోంథా తుఫానుపై అప్రమత్తంగా ఉండండి
● జూమ్ కాన్ఫరెన్స్‌లో
డీబీసీడబ్ల్యూఈఓ కే ప్రసూన
కర్నూలు(అర్బన్): మోంథా తుఫానుతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లోని విద్యార్థుల శ్రేయస్సు పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన కోరారు. ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో ఆమె జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున పాత భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు చెందిన హెచ్‌డబ్ల్యూఓలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే విద్యార్థుల వసతికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అందరు హెచ్‌డబ్ల్యూఓలు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే ఉండాలన్నారు. మూడు రోజులు వర్షాలు ఉన్నందున విద్యార్థుల మెనూకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, అవసరమైన నిత్యావసర సరుకులను నాలుగైదు రోజులకు సరిపడా నిల్వ ఉంచుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్లను కూడా అదనంగా నిల్వ ఉంచుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా పట్ల జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులు వర్షంలో తడవకుండా చూడాలన్నారు. అలాగే హాస్టళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలోనే పలు వసతి గృహాల విద్యార్థులతో ఆమె జూమ్ కాన్ఫరెన్స్‌లోనే వారికి అందుతున్న మెనూ, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
