ఆలూరులో వాల్మీకుల నిరసన
ఆలూరు: టీడీపీ ఆలూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్ వైకుంఠం జ్మోతమ్మ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన చేశారు. ఆలూరు పాతబస్టాండు సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అథితిగృహం ఆవరణలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు వాల్మీకి రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు వాల్మీకి వరుణ్‌కుమార్ మాట్లాడారు. వాల్మీకి కులస్తుల్లో ఉన్న ప్రాంతీయ వ్యత్యాసాలను, ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని తొలగించాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వినతి పత్రాన్ని అందజేశారన్నారు. అయితే ఎమ్మెల్యేకు ఇంగ్లిష్, హిందీ భాషలు రావని, వినతి పత్రం ఎలా అందించారని టీడీపీ ఇన్‌చార్జ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెంటనే వైకుంఠం జ్మోతమ్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలూరు వ్యవసాయమార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అరికెర వెంకటేశ్వర్లు, మనేకుర్తి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రసాద్‌రెడ్డి, ఆలూరు మండల వైఎస్సార్‌సీపీ కో–కన్వీనర్ వీరేష్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగేంద్ర, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
