
మనేకుర్తిలో చోరీ
ఆలూరు రూరల్: మనేకుర్తి గ్రామంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఇంటి తలుపులు, బీరువా ధ్వంసం చేసి బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద లింగయ్య వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇంటి వద్ద భార్య లక్ష్మి, కూతురు నివాసం ఉంటున్నారు. గురువారం గ్రామంలో బంధువు మరణించడంతో కూతురుతో కలిసి ఇంటికి తాళాలు వేసి అక్కడికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు బీరువా తలుపులు పెకిలించి అందులో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు ఆలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్రాక్టర్ ఢీకొని
యువకుడి మృతి
బేతంచెర్ల: గోర్లగుట్ట గ్రామంలో నాపరాళ్ల ట్రాక్టర్, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ముక్కెర నారాయణరెడ్డి కుమారుడు నరేంద్ర కుమార్ రెడ్డి (30), చాకలి సుబ్బయ్య కలసి బైక్‌పై పలుకూరు క్రాస్ రోడ్డు వద్దకు బయలు దేరారు. అదే సమయంలో బనగానపల్లె మండలం రామకృష్ణాపురం గ్రామం నుంచి నాపరాళ్ల లోడుతో బేతంచెర్ల వైపు వస్తున్న ట్రాక్టర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నరేంద్ర కుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, చాకలి సుబ్బయ్యతో పాటు అదే సమయంలో అక్కడ రోడ్డు దాటుతున్న బాలిక రజని గాయాలతో బయట పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మనేకుర్తిలో చోరీ