
హామీలు ‘భద్రం’.. ప్రాజెక్టులు ఛిద్రం
కర్నూలు సిటీ: ‘‘రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం.. ప్రతి ఎకరానికి నీరిస్తాం..కరువును శాశ్వతంగా తరిమేస్తాం’’ అని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా పలు సభల్లోనూ రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్నాం అంటున్నారు. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. తుంగభద్ర నదికి వచ్చిన వరద నీటిని వినియోగించుకోలేకపోయారు. వచ్చిన నీటిని వచ్చినట్టే కిందకు వదిలేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం ఈ దుస్థితి నెలకొంది. తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్టీఎస్ కుడి కాలువ, హగేరి నదిపై వేదావతి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో వాటిని టీడీపీ నేతలు ప్రచార అస్త్రాలుగా వాడుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టులపై దృష్టికి సారించలేదు.
నీరు నిల్వలేక నిర్వేదం
ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాలకు ప్రధాన జలవనరు తుంగభద్ర నది. ఈ నది జలాలపై ఆధారపడి కేసీ కింద 2.65 లక్షలు, తుంగభద్ర దిగువ కాలువ కింద 1.51 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి. అలాగే ఈ నదిపై 50కిపైగా ఎత్తిపోతల పథకాలు ఉండగా 36 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. తుంగభద్ర నదిలో ఏటా 250 నుంచి 400 టీఎంసీలకుపైగా నీటి లభ్యత ఉంది. ఇందులో 10 శాతం నీటిని కూడా వినియోగించుకోని పరిస్థితులు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఈ ఏడాది 333 టీఎంసీల తుంగభద్ర జలాలు వృథా అయినట్లు సమాచారం. తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించి ఉంటే 20 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మిస్తే 4 టీఎంసీలు, హగేరిపై వేదావతి స్కీమ్ పూర్తి చేస్తే 8 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉండేది.
మాటలు.. నీటి మూటలు!
కర్నూలు–కడప కాలువ కింద 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే 259 గ్రామాలకు తాగునీరు అందుతోంది. కేసీ కాలువకు 39.9 టీఎంసీల తుంగభద్ర నీటిని కేటాయించినా నిల్వ చేసుకునేందుకు అవసరమైన రిజర్వాయర్లు లేవు. సుంకేసులలో 1.2 టీఎంసీలు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 2.965 టీఎంసీలకు మాత్రమే నిల్వ చేయవచ్చు. కేసీ ఆయకట్టుకు రెండు పంటలకు నీరు ఇవ్వాలంటే గుండ్రేవుల అవసరమని 2014లో మొదటగా రూ.2,400 కోట్లతో అంచనాలు వేశారు. 2019 ఎన్నికలకు నెలన్నర ముందు పరిపాలన అనుమతులు ఇచ్చి..నామమాత్రంగానే శంకుస్థాపన చేసి వదిలేశారు. 2024 ఎన్నికల సమయంలో నారా లోకేష్ పాదయాత్రలో, ఎన్నికల ప్రచారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కచ్చితంగా గుండ్రేవుల నిర్మించి తీరుతామని హామీనిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మిస్తామని టీడీపీ మంత్రి చెప్పిన మాటకే నీటి మూట అయ్యింది.
నిధులు ఇవ్వలేక..
మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల ఆయకట్టుకు 4 టీఎంసీల సాగు నీటిని అందించేందుకు ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టును రూ.1,985.42 కోట్లతో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ఆనకట్ట కుడి వైపు హెడ్‌వర్క్, కొంత కాలువ పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాన ఏడాదిగా పనులు నిలిపి వేసింది. పనులకు ఈ ఏడాది జూలైలో గ్రీన్ ఇచ్చినా నిధులు ఇవ్వకలేదు. దీంతో పనులు మొదలు కాలేదు.
తుంగభద్ర నదిపై నిర్మించాలనుకున్న గుండ్రేవుల ప్రాజెక్టు విషయంపై వివాదం ఉంది. ఈ ప్రాజెక్టు ప్రస్ధావన అసెంబ్లీలో వచ్చిందే. ఇంకేమీ లేదు. ఆర్డీఎస్ కుడి కాలువ, వేదావతి ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రూ. 30 కోట్ల నిధులు కూడా ఇస్తామని చెప్పారు. పనులు త్వరలోనే మొదలు కానున్నాయి.
– కబీర్ బాషా, జల వనరుల శాఖ,
కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ
వరద నీటిని వినియోగించుకోని
కూటమి ప్రభుత్వం
వృథా అయిన తుంగభద్ర నది జలాలు
పూర్తికాని ఆర్‌డీఎస్ కుడి కాలువ
వేదావతి ప్రాజెక్టులను
పట్టించుకోని వైనం
రైతులకు మిగిలింది క‘న్నీటి’ కష్టాలే!
ప్రకటనకే పరిమితం
ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లోని 80 వేల ఎకరాలకు హగేరి నది నుంచి సాగు నీటిని అందించేందుకు వేదావతి లిఫ్ట్‌ను రూ.1942.80 కోట్లతో గత ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. స్టేజ్–1, స్టేజ్–2 పనులు సుమారు రూ.106.2 కోట్ల పనులు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నిలిపి వేశారు. తిరిగి పనులు మొదలు పెట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినా అది కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అయ్యాయి.

హామీలు ‘భద్రం’.. ప్రాజెక్టులు ఛిద్రం

హామీలు ‘భద్రం’.. ప్రాజెక్టులు ఛిద్రం