
స్తంభించిన నాపరాతి రవాణా
కొలిమిగుండ్ల: నాపరాళ్ల రవాణాకు సీనరేజ్ వసూలు చేసే బాధ్యత ప్రవేట్ సంస్థకు అప్పగించడంతో ఆదివారం నాపరాతి రవాణా స్తంభించింది. ట్రాక్టర్, లారీలకు ప్రతి ట్రిప్పుకు టన్నుల ప్రకారం సీనరేజ్ చెల్లించాల్సి వస్తోంది. దీంతో యజమానులు నాపరాతి గనుల్లోంచి రాళ్లను ఎగుమతి చేయకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. లోడింగ్, అన్‌లోడింగ్ కార్మికులు, ట్రాక్టర్, లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల, అవుకు మండలాల నుంచి ప్రతి రోజు ట్రాక్టర్లు 300, లారీలు 30 మేర ఇతర ప్రాంతాలకు నాపరాళ్లను ఎగుమతి చేస్తుంటారు. సీనరేజ్ కారణంగా నాపరాళ్ల వాహనాలు రవాణా కాక పోవడంతో ప్రధాన రహదారి బోసిపోయింది. సీనరేజ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ రాయల్టీలను ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా బుక్‌ల రూపంలో ఇవ్వనున్నారు. ట్రాక్టర్‌కు 8 టన్నుల నుంచి 5 టన్నులకు కుదించినట్లు తెలుస్తుంది. అయినా ఒక్కో ట్రిప్పుకు రూ.1100కు పైగానే చెల్లించాల్సి రావడంతో యజమానులకు దిక్కుతోచడం లేదు.
నాపరాళ్ల ట్రాక్టర్లు అడ్డగింత
బేతంచెర్ల: బనగానపల్లె రహదారిలోని ప్రైవేట్ రాయల్టీ చెక్ పోస్టు వద్ద సిబ్బంది ఆదివారం బేతంచెర్ల పట్టణంలోకి వస్తున్న నాపరాళ్ల ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రాయల్టీలు ఉంటేనే పంపిస్తామని లేకపోతే పంపమని తెలపడంతో నాపరాళ్ల ట్రాక్టర్లు అన్నీ నిలిచిపోయాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాపరాళ్ల పరిశ్రమలకు రాయల్టీలు ఇస్తుండగా ప్రస్తుతం ప్రైవేటుకు అప్పగించడంతో బనగానపల్లె రహదారిలో చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రైవేటుకు అప్పగించడమే కానీ ఇంత వరకు గనుల యజమానులకు రాయల్టీలు ఇవ్వలేదు. రాయల్టీలు జారీ చేయకుండా ఇలా అడ్డుకుంటే తమ పరిస్థితి ఏంటని ట్రాక్టర్ల డ్రైవర్లు, లోడింగ్ కార్మికులు వాగ్వాదం చేయడంతో సిబ్బంది వదిలి వేశారు.