
ఉడుము కనిపించెన్!
దొర్నిపాడు: ఉడుము ఒకప్పుడు పల్లెల్లో తరచూ కనిపించేవి. ప్రస్తుతం వాటి సంతతి కనుమరుగవుతుండటంతో చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఆదివారం దొర్నిపాడు పొలాల్లో మూడు అడుగుల పొడవైన ఉడుము ఆహార అన్వేషణలో భాగంగా పరుగులు తీస్తూ ఓ కల్వర్టు వద్ద ఆగిపోయింది. పొడవాటి మెడ, బలమైన కాళ్లు, శక్తివంతమైన తోక, పదునైన పళ్లతో కనిపించింది. పొలాల్లో, చిత్తడినేలలు, నదుల దగ్గర ఇవి నివసిస్తాయి. మాంసాహారులు కావడంతో కీటకాలు, చిన్న సరీసృపాలు, పక్షులు, వాటి గుడ్లను ఆహారంగా తీసుకుంటాయి. అప్పట్లో పెద్దలు ఏదైనా బలం ప్రదర్శించాలంటే ఉడుం పట్టు పట్టాలి అనే సామెతను వాడేవారు. వాటి కాళ్లలో అంత పట్టుత్వం ఉంటుంది. గతంలో కొందరు ఉడుము మాంసం తినేవారు. అంతరించిపోతున్న జాతుల్లో ఇది చేరడంతో దీనిని వేటాడితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తారు.