
ఆర్టీసీ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలి
కర్నూలు సిటీ: ఆర్టీసీ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ అద్దె బస్సుల డ్రైవర్లు నిరసన తెలిపారు. కర్నూలు కొత్త బస్టాండ్ ఆవరణలో మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దువ్వూరులో ఇంటి దగ్గర బస్సును ఆపలేదన్న కారణంతో ఆళ్లగడ్డ డిపోలో అద్దె బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న మహమ్మద్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. దాడిలో గాయపడిన మహమ్మద్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్నారు. కోలుకునేందుకు ఆరు నెలల సమయం పడుతుందని, అంత వరకు ప్రభుత్వమే చికిత్సకు అయ్యే ఖర్చులు భరించాలన్నారు. డ్రైవర్‌కు రూ.5 లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించాలన్నారు. గతంలో ఎమ్మిగనూరు దగ్గర కూడా డ్రైవర్‌పై దాడి చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసిన తరువాత ప్రయాణికుల రద్దీ పెరిగిపోయిందన్నారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్లకు రక్షణ కల్పించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. హైర్ బస్సు కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య గౌడ్, గౌరవ సలహాదారులు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి యు.శ్రీనివాసులు, జిల్లా నాయకులు రాంబాబు, చెన్నకేశవులు, మద్దిలేటి, మధు, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.