
వరద నీటి మళ్లింపుతోనే పరిష్కారం
కర్నూలు(అర్బన్): శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ ద్వారా సముద్రంలో కలిసే నీటిలో కొంత భాగాన్ని పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలకు మళ్లిస్తే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. వరద నీటి మళ్లీంపుతో జిల్లాలోని వెలుగోడు, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను నింపుకోవడంతో పాటు కాలువల్లో నిరంతర ప్రవాహం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈ దిశగా నీటి పారుదల శాఖకు చెందిన ఇంజినీర్లు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ ఏడాది జూన్ 22వ తేది నాటికి శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉండిందని, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేసి ఉంటే కనీసం బోర్లు రీచార్జ్ అయ్యేవని ఇటీవల నంద్యాలలో జరిగిన ఐఏబీ సమావేశంలో ప్రస్తావించినట్లు చెప్పారు. శ్రీశైలం నీటి విడుదల మన చేతిలో లేదని, దీనికి తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అనుమతులు కావాలని సంబంధిత పర్యవేక్షక ఇంజినీరు ప్రతాప్ సమాధానమిచ్చారని, సమాధాన ప్రతులను సమావేశంలో చూపించారు. శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడుకు విడుదల చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ బీవీ సుబ్బారెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
స్థాయీ సంఘ సమావేశాలంటే
అంత చులకననా.... ?
జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలంటే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తరచు గైర్హాజరు అవడంపై జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సహేతుక కారణం లేకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా సమావేశాలకు గైర్హాజరయ్యే అధికారులకు నోటీసులు జారీ చేయాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తమకేమి పనుల్లేక సమావేశాలకు వస్తున్నామా? అసెంబ్లీ ద్వారా సభా హక్కుల నోటీసులను ఇప్పిస్తానని గైర్హాజరైన అధికారులకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హెచ్చరించారు.
రూ.2 .50 కోట్ల నిధుల ల్యాప్స్‌పై
పీఆర్ కమిషనర్‌కు ఫిర్యాదు
జిల్లా పరిషత్ నిధులతో నిర్ణీత సమయంలోగా చేపట్టాల్సిన పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించి రూ.2.50 కోట్ల నిధులు ల్యాప్స్‌కు కారణమైన పీఆర్ ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు పీఆర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇయర్ మార్క్‌డ్ నిధులు ఎస్సీ సంక్షేమానికి 15 శాతం , ఎస్టీల సంక్షేమానికి 6 శాతం, మహిళా శిశు సంక్షేమానికి 15 శాతం నిధులు మొత్తం రూ. 5.91 కోట్ల విలువ చేసే పనులను అప్పగించామన్నారు. ఈ పనులను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయకుంటే నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉందని ప్రతి నెలా పీఆర్ ఇంజినీర్లను హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. అయినా, పనుల్లో జరిగిన జాప్యం వల్ల రూ.2.50 కోట్ల నిధులు ల్యాప్స్ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సాగు,తాగు నీటి సమస్యపై
జెడ్పీ చైర్మన్
స్థాయీ సంఘ సమావేశాలంటే
అంత చులకననా ?
గైర్హాజరైన అధికారులకు
నోటీసుల జారీకి ఆదేశం
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో
అనేక అంశాలపై పాపిరెడ్డి సమీక్ష
జెడ్పీ నిధుల ల్యాప్స్‌పై
పీఆర్ కమిషనర్‌కు
ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి
స్థాయీ సంఘ సమావేశాల్లో ఇంకా ఏం మాట్లాడారంటే
ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీలకు పనులు దొరుకుతున్నాయే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడం లేదని జెడ్పీ చైర్మన్ అన్నారు. ‘రబీ సీజన్‌లో రైతుల అవసరాలకు అనుగుణంగా శనగ, పప్పుశనగ విత్తనాలను అందించాలి. దివ్యాంగుల పెన్షన్లలో అర్హులైన అనేక మందికి నోటీసులు పంపించడం దారుణం. అర్హులైన వారందరికి పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపట్టాల’ని ఆయన చెప్పారు.
ఉపాధి హామీ పథకం పనుల్లో క్షేత్ర స్థాయిలో అవినీతి అక్రమాలు జోరుగా సాగుతున్నాయని, అలాగే గృహ నిర్మాణాల ఫ్లెక్సీలు పెట్టుకొని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి చెప్పారు.
కర్నూలు – గుంటూరు జాతీయ రహదారి పారుమంచాల వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని జూపాడుబంగ్లా జెడ్పీటీసీ పి. జగదీశ్వరరెడ్డి కోరారు.

వరద నీటి మళ్లింపుతోనే పరిష్కారం