
ఎంపీపీని దించే టీడీపీ కుట్రలు సాగవు
● కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్ష
కర్నూలు (టౌన్): కర్నూలు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఎంపీపీని దించే కుట్రలు టీడీపీ మానుకోవాలని వైఎస్సార్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి హితవు పలికారు. కర్నూలు నగరంలోని ఎల్కూర్ ఎస్టేట్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం నూతనపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత క్రిష్ణ అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ఎమ్మెల్యేను కలిశారన్నారు. అయితే పార్టీ కండువా కప్పి టీడీపీలో చేరినట్లు ప్రకటించారన్నారు. ఆ పార్టీ ఎంతగా దిగజారిందో ఇట్టే అర్థమవుతుందన్నారు. క్రిష్ణ మాట్లాడుతూ.. గ్రామ సమస్యలు చర్చిద్దామని, బిల్లుల సమస్యలు మాట్లాడుదామని వెళ్లాలని, అయితే పార్టీలో చేరుతున్నట్లు కండువాలు కప్పారన్నారు. దీంతో అక్కడ పది నిమిషాలు కూడా ఉండలేదన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనంతరం కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పుకున్నారు. జెడ్పీటీసీ సభ్యుడు ప్రసన్న కుమార్, కర్నూలు మండల మాజీ ఉపాద్యక్షులు డి. వాసు, కర్నూలు మండల వైస్. ఎంపీపీ నెహేమ్యా, కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు, ఆర్. కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, సంపత్‌కుమార్, కోడుమూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఎం. కె. వెంకటేశ్వర్లు, మద్దిలేటి, పసుపల బాషా, మందలపాడు గోపాల్, నూతనపల్లె గ్రామస్తులు టి. మధు, ఎర్రమల, నారయణ, మద్దయ్య పాల్గొన్నారు.