
మళ్లీ కుంగిన అవుకు రిజర్వాయర్ రివిట్‌మెంట్
● కట్ట నుంచి లీకేజీ అవుతున్న నీళ్లు
● ఆందోళనలో రైతన్నలు
● అధికారుల నిర్లక్ష్యమే
కారణమని ఆవేదన
అవుకు(కొలిమిగుండ్ల): ఏడాది వ్యవధిలోనే రెండో సారి మళ్లీ అవుకు రిజర్వాయర్ లోపల భాగంలో ఎర్రటి రాళ్లతో నిర్మించిన రివిట్‌మెంట్ కుంగిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున ఈఘటన చోటు చేసుకోవడంతో అవుకుతో పాటు చుట్టు పక్కల గ్రామాల రైతులు, ప్రజలు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు రిజర్వాయర్‌లో నీళ్ల సామర్థ్యం తగ్గించేందుకు చెర్లోపల్లె సమీపంలోని గాలేరు నగరి వరద కాల్వ వద్ద గేట్లు ఎత్తి వైఎస్సార్ కడప జిల్లా గండికోటకు 8వేల క్యూసెక్కులు వదిలారు. రివిట్‌మెంట్ కుంగిన సమయంలో మొదట్లో ఎక్కువ మొత్తంలో నీళ్లు లీకేజీ అయ్యాయి. తర్వాత కుంగిన చోట లోపల రాళ్లు,మట్టి అడ్డుపడటంతో తగ్గుమఖం పట్టాయి. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 3.64 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఏడాది క్రితం రివిట్‌మెంట్ కుంగినప్పుడే నిపుణుల సాయంతో శాశ్వత పరిష్కారం చేసుంటే మళ్లీ ఈ పరిస్థితి తలెత్తేది కాదని రైతులు అభిప్రాయ పడుతున్నారు. అప్పట్లో ఎస్సార్బీసీ అధికారులు నల్లమట్టి తీసుకొచ్చి కుంగిన చోట తాత్కాలికంగా పూడ్చివేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కట్ట దిగువన బండ్ నుంచి సీఫేజ్ వాటర్ చాలా రోజుల నుంచి లీక్ అవుతూనే ఉన్నాయి. అధికారులు లీకేజ్ వద్ద రాళ్లు అడ్డుపెట్టారు. ప్రస్తుతం రివిట్‌మెంట్ కుంగడంతో పైన నీళ్లు లీకేజీ అయ్యాయి. రిజర్వాయర్ వద్ద రివిట్‌మెంట్ కుంగిన విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని, ఇప్పటికై నా భ ద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. కాగా రిజర్వాయర్ వద్ద రివిట్‌మెంట్ కుంగిన ప్రదేశాన్ని ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్‌తో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. ఎక్కువ నీళ్లు నిల్వ చేయడం వల్లనే కుంగిందని నిర్ధారణకు వచ్చారు. కట్ట వద్ద లీకేజీ అవుతున్న నీటిని పరిశీలించారు. అధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రివిట్‌మెంట్ కుంగిన చోట మరమ్మతు లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మళ్లీ కుంగిన అవుకు రిజర్వాయర్ రివిట్‌మెంట్