
వ్యక్తి బలవన్మరణం
కర్నూలు (రూరల్): మండల పరిధిలోని ఆర్.కొంతలపాడు గ్రామానికి చెందిన కురువ తిమ్మప్ప కుమారుడు కురువ గిడ్డయ్య (50) గత నెల 30వ తేదీన భార్యతో గొడవ పడి తన నివాసంలోనే పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతిచెందాడు. ఇతనికి కుమారుడు, కుమార్తె సంతానం. భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు తాలూకా పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఆస్పరి: నగరూరు బస్టాప్ సమీపంలో గురువారం రాత్రి స్కూటర్‌ను ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో శశిధర్‌రెడ్డి (35) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఇతను గురువారం రాత్రి స్కూటర్‌పై ఆదోనికి వస్తుండగా ఆస్పరి దాటాక నగరూరు బస్టాప్ సమీంలో ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న ఐచర్‌వాహనం ఢీకొంది. ఈఘటనలో శశిధర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు.
అడ్రస్ అడిగి..బంగారు గొలుసు లాక్కెళ్లాడు
బనగానపల్లె రూరల్: ఓ అగంతకుండు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు.
బనగానపల్లె పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కొండపేటలో నివసించే కర్నాటి రమాదేవి తెల్లవారుజామున ఇంటి ముందు నీళ్లు చల్లుతుండగా గుర్తు తెలియని వ్యక్తి తలకు హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చాడు. ఈ కాలనీలో కొత్తగా తమకు తెలిసిన వాళ్లు చేరారని వారి ఇల్లు ఎక్కడుందని అడిగాడు. తెలియదని సమాధానం చెబుతుండగానే మెడలోని బంగారు గొలుసు లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కల్పన తెలిపారు.కాగా చోరీకి గురైన చైన్ సుమారు మూడు తులాలు ఉంటుందని రమాదేవి తెలిపారు.
ఈతకు వెళ్లి మృత్యు ఒడికి
వెల్దుర్తి: బావిలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కలుగొట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూలీ పనులు చేసుకుని జీవించే నక్కలి ఎల్లకృష్ణ (45) ఇసుక వంక సమీపంలోని ఎస్సీ బావిలో ఈతకు వెళ్లాడు. అప్పటికే అక్కడ పలువురు ఈదులాడుతున్నారు. ఎల్లకృష్ణ బావి పై నుంచి తలకిందులుగా నీటిలోకి కొర్రు వేశాడు. అయితే, ఎంత సేపటికి బయటకు రాకపోవడం చూసి మిగతావారు గాలింపు చేపట్టగా వారికి కనబడలేదు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మద్దిలేటి, గ్రామస్తులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వెల్దుర్తి పోలీసులకు, డోన్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. డోన్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ రంగస్వామి గౌడ్ సిబ్బంది, ఫైరింజన్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. బావిలోపలికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడికి భార్య మల్లేశ్వరి ఉంది.