
ఘనంగా బీఎస్‌ఎన్‌ఎల్ రజతోత్సవాలు
కర్నూలు(హాస్పిటల్): భారత సంచార నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో సంస్థ ఆధ్వర్యంలో రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ జి.రమేష మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ 2000 అక్టోబర్ 1న ప్రభుత్వ రంగ సెక్టార్ యూనిట్‌గా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ప్రజలకు చేరువగా మారుమూల గ్రామాలకు కాపర్ ద్వారా ల్యాండ్‌లైన్, బ్రాండ్ బాండ్ సేవలను అందిస్తోందన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పూర్తి ఫైబర్ టెక్నాలజీ ద్వారా వాయిస్, హై స్పీడ్ ఇంటర్‌నెట్ అందిస్తోందన్నారు. ప్రపంచంలోనే స్వదేశీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఆరవ అతి పెద్ద సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్ రూపుదిద్దుకుందన్నారు. వినియోగదారులు తమ పాత సిమ్‌కార్డులను 4జీ సిమ్‌లుగా మార్చుకోవాలన్నారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా సరసమైన ధరలతో ప్రవేశపెట్టిన నూతన ప్లాన్లను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ సాయినాథ్, ఏజీఎంలు వి.శ్రీను నాయక్, దేవచంద్ నాయక్, లక్ష్మనాయక్, మురళీకృష్ణ, నారాయణస్వామి, వి.జాన్సన్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.