
చెరువులు నింపి భూగర్భజలాలు పెంపొందిద్దాం
కర్నూలు(సెంట్రల్): చెరువులను నింపి భూగర్భ జలాలను పెంపొందిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో చెరువులు నింపడం–భూగర్భ జలాలు పెంపొందించడం అనే అంశంపై ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 11 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు చేపట్టి హంద్రీనీవా నీటితో నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈ బాలచంద్రారెడ్డిని ఆదేశించారు. జిల్లాలోని చెక్ డ్యాంల మరమ్మతుకు ప్రతిపాదనలు తయారు చేసి మూడు రోజుల్లో నివేదించాలని డ్వామా పీడీ వెంకట రమణయ్యను ఆదేశించారు. జిల్లాలోని మద్దికెర, ఆస్పరి తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటికి ఇబ్బంది ఉంటున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హెచ్‌ఎన్‌ఎస్ ఎస్‌ఈ పాండురంగయ్య, ఈఈ గుణకర్‌రెడ్డి, ఎంఐఈఈ వెంకటరాముడు, డ్వామా పీడీ వెంకటరమణమ్య, భూగర్భ జలాల శాఖ డీడీ సన్నన్న, సీపీఓ భారతి తదితరులు పాల్గొన్నారు.
3న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 3న స్థానిక మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు–ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. ఆయా స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించే సమయానికి అనుగుణంగా చైర్‌పర్సన్లు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, జెడ్పీటీసీలు హాజరు కావాలని సీఈఓ కోరారు.
డీపీఓలో ఆయుధ పూజ
కర్నూలు: విజయదశమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్‌లో ఎస్పీ దంపతులు ఆయుధ పూజ నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా వచ్చే ఆయుధ పూజను డీపీఓలోని శమీ వృక్షం వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్, సతీమణి ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ కలసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా దుర్గాదేవి చిత్రపటానికి, జమ్మి చెట్టుకు, పోలీసు వాహనాలకు, పోలీసులు వినియోగించే ఆయుధాగారంలోని అన్ని ఆయుధాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ దంపతులు ఆకాంక్షిస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

చెరువులు నింపి భూగర్భజలాలు పెంపొందిద్దాం