
లిఖిత పూర్వక హామీ ఇస్తేనే సమ్మె విరమణ
● డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ధర్నాలో పీహెచ్‌సీ వైద్యులు
కర్నూలు(హాస్పిటల్): దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రఘురామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ బాలకృష్ణ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైద్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము డ్యూటీలు ఎగ్గొట్టి ఆందోళనలు చేయడం లేదని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. గత సంవత్సరం ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు. 20 ఏళ్లుగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నా తమకు పదోన్నతులు రావడం లేదని, సీనియర్లు, జూనియర్లు ఒకే కేడర్‌లో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలనికోరారు. అలాగే వైద్యులకు కచ్చితమైన పనిగంటలు ఏర్పాటు చేయాలని, స్థిరమైన వారాంతపు సెలవు ఇవ్వాలని, వైద్యుల జాబ్ చార్ట్ ఇవ్వాలని, అనధికార వ్యక్తులు(నాన్ మెడికల్, శాఖకు సంబంధం లేనివారు) పీహెచ్‌సీలను విచ్చలవిడిగా తనిఖీ చేయకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు.
విధుల్లో చేరేందుకు ససేమిరా..!
పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కర్నూలు మెడికల్ కాలేజీలోని పీజీ వైద్యులు, ఎస్‌ఆర్‌లు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, ఆయుష్ వైద్యులను 35 పీహెచ్‌సీల్లో తాత్కాలికంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఉన్నఫలంగా తమను అక్కడికి వెళ్లమంటే ఎలాగని, పీహెచ్‌సీల్లో తమకు వసతి సౌకర్యాలు లేవని, ఎలా ఉండాలని పలువురు వైద్యులు బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు మహిళా వైద్యులు సుదూర ప్రాంతాలకు తాము వెళ్లి ఉండలేమని, తమను డ్యూటీ నుంచి మినహాయించాలని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పలువురి స్థానంలో వేరొకరిని చేరుస్తూ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.