
కూటమి పాలనలో రైతులకు అన్నీ కష్టాలే
● ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి
● దేవనకొండలో పంట పొలాల పరిశీలన
దేవనకొండ: కూటమి ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. మండల కేంద్రం దేవనకొండ, అలారుదిన్నె తదితర గ్రామాల్లో వర్షాల ధాటికి నష్టపోయిన పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 40 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఉల్లి, టమాట రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గిట్టుబాటు ధర కల్పించి ఆయా పంటల దిగుబడులను సర్కారు కొనుగోలు చేయలేదన్నారు. తొలి నుంచి చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదన్నారు. వైఎస్ జగన్ పాలనలో రైతులు సంతోషంగా ఉండేవారని, నాడు విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు సహాయ సహకారాలు అందేవన్నారు. ఉచిత పంటల బీమాతో నష్టపోయిన రైతులను ఆదుకునేవారన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఏదిఏమైనా ప్రస్తుత వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు చొప్పున పరిహారం అందించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామకృష్ణ, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ప్రేమనాథ్‌రెడ్డి, హంపిరెడ్డి పాల్గొన్నారు.