
పింఛన్ల పంపిణీ.. తప్పని అవస్థలు
● ఇంటి దగ్గర అందజేత నామమాత్రమే ● అవ్వాతాతలకు తీరని ఎదురుచూపులు
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వ పాలనలో ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ చెప్పుకోవడానికే పరిమితమైంది. ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా అవ్వతాతలు, వికలాంగులు ఇతర పింఛన్‌దారులు గ్రామ, వార్డు సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పనులు వదులుకొని చాలామంది పింఛన్‌దారులు సచివాలయాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు కాశారు. అక్టోబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. పలు మండలాల్లో పింఛన్‌దారులందరికీ ఒకే చోటుకు పిలిపించి పంపిణీ చేశారు. దీని వల్ల అవ్వాతాతలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి డీఆర్‌డీఏ పీడీ వైపీ రమణారెడ్డితో కలసి కర్నూలు నగరంలోని వివిధ కాలనీల్లో పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పింఛన్లు పంపిణీ చేశారు.
కర్నూలులో 94.12 శాతం, నంద్యాల జిల్లాలో 94.43 శాతం పంపిణీ...
అక్టోబరు నెలకు సంబంధించి కర్నూలు జిల్లాలో 2,38,755 పింఛన్లు ఉండగా...సాయంత్రం 6 గంటల సమయానికి 2,24,711 (94.12 శాతం) మందికి పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,15,005 పింఛన్లు ఉండగా 2,03,032 (94.43 శాతం) పంపిణీ చేశారు. ఇంకా తీసుకోని వారికి ఈ నెల 3వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.