
2029 ఎన్నికల్లో దళితుల సత్తా చూపుతాం
పీపీపీ విధానంతో పేద, సామాన్యులకు వైద్య విద్య దూరం
ప్రైవేటీకరణ విరమించుకోకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధం
కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు
నిరసనగా అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
కర్నూలు(టౌన్): దళిత పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దళితుల సత్తా ఏంటో చూపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రేలంపాడు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోల్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కొండారెడ్డి బురుజు మీదుగా పాతబస్టాండ్ వరకు సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, పేదల వ్యతిరేకి సీఎం అంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ తీరుకు నిరసనగా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేలంపాడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో అప్పులు, ప్రభుత్వ ఆస్తులు అమ్మడమే పనిగా కూటమి ప్రభు త్వ పాలన సాగుతోందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో సదుద్దేశంతో రాష్ట్రంలో ఒకేసారి 17 ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహణ చేతకాదని తప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి రూ.వేల కోట్ల వైద్య కళాశాలల భూములు తమ్ముళ్లకు దారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వమే కొనసాగించాలన్న డిమాండ్‌తో దశల వారీ ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామన్నారు.
● ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైల్వే ప్రసాద్, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చంద్రకంటి కిషన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మాల మాదిగలను మోసం చేసేందుకే పీపీపీ విధానాన్ని అమలు చేస్తొందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రంలో దళిత పిల్లలకు విద్య, వైద్యాన్ని పూర్తిగా దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. వైద్య కళాశాలలే కాకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందే అవకాశాలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే దళితులంతా ఏకమై ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
● ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు కమతం పరుశరాం, సి.హెచ్.మద్దయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం విద్యను సర్వనాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో చదువులకు ఎలాంటి అటంకాలు లేకుండా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోగలిగారన్నారు. ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో డిగ్రీ కళాశాలలు మూతపడి విద్యార్థులు రోడ్ల పాలయ్యే పరిస్థితి నెలకొందన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనమరకల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ప్రభుదాస్, అవతారం, జిల్లా కార్యదర్శి గంధం చంద్ర, మంత్రాలయం ఇన్‌చార్జి జయపాల్, ఆదోని ఇన్‌చార్జి ఏసేపు, ఆర్‌టీఐ నగర అధ్యక్షులు గద్ద రాజశేఖర్ బాబు, యాక్టివిటీ కమిటీ జిల్లా కార్యదర్శి జగ్గుల లాజర్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు హరి, జిల్లా ఉపాధ్యక్షులు ఏసు, కార్యదర్శి శ్రీకాంత్, శివ, కటారి సురేష్, చందు, యోగి తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే ఓటు ద్వారా బుద్ధి చెబుతాం

2029 ఎన్నికల్లో దళితుల సత్తా చూపుతాం