
● సిద్దిదాయిని అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబా
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు దేదీప్యమానంగా సాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో మంగళవారం సిద్దిదాయిని స్వరూపంలో భ్రమరాంబాదేవి, కైలాస వాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు విహరించి భక్తులను కరుణించారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబాదేవిని సిద్దిదాయిని అలంకారంలో అలంకరించి అమ్మవారి ఆలయం ముందుభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వేదికపై ఉంచి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా హారతులిచ్చారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామిఅమ్మవార్లను కై లాస వాహనంపైకి చేర్చి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సిద్దిదాయిని అమ్మవారిని, కై లాస వాహనంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. కళాకారుల విచిత్ర వేషధారణలు, నృత్యాలతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆయా పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో నేడు..
దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం భ్రమరాంబాదేవి రమావాణీసేవిత రాజరాజేశ్వరి అలంకారంలో, అశ్వవాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌తో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.