
బన్ని ఉత్సవంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కర్నూలు: దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీ జరిగే దేవనగట్టు మాలమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని,ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసిందన్నారు. అల్లర్లకు పాల్పడటం నిప్పులు విసరడం వంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రింగుల కర్రలతో బన్ని ఉత్సవంలో పాల్గొన డం వల్ల కలిగే దుష్పరిణామాలపై దేవరగట్టు చుట్టుప్రక్కల గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టి గతంలో ఘర్షణలకు పాల్పడ్డ వారిని, అక్రమ మద్యం రవాణా చేసినవారిని గుర్తించి 195 మందిని బైండోవర్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బన్ని ఉత్సవంలో ఫైర్, వైద్య, అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
భారీ బందోబస్తు...
ఏడుగురు డీఎస్పీలు, 50 సీఐలు, ఆర్‌ఐలు, 59 మంది ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 95 మంది ఏఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది సివిల్ ఏఆర్ కానిస్టేబుళ్లు, 18 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 90 మంది హోంగార్డులను బన్ని ఉత్సవం బందోబస్తు విధులకు నియమించినట్లు ఎస్పీ వెల్లడించారు.