
ప్రైవేటీకరిస్తే ఊరుకోం
ప్రభుత్వ సొమ్మును అనుచరులకు దోచిపెట్టడానికే ప్రైవేటీకరణ
దీని వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతోంది
సంపద సృష్టిస్తామని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తే ఎలా?
స్పార్క్, జన విజ్ఞాన వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఆగ్రహం
ప్రభుత్వ నిధులతోనే మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగిస్తే ఊరుకోమని, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని రాజకీయ, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా తప్పు బట్టాయి. వెంటనే అందుకోసం విడుదల చేసిన జీఓలు 107,108లను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్య విభాగాలను ప్రభుత్వమే నిర్వహించాలని, అయితే, కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా తమ అనుకూల వ్యక్తులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకుందని వక్తలు మండిపడ్డారు. మంగళవారం జెడ్పీలోని ఎంపీపీ హాలులో స్పార్క్, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్పార్క్ కన్వీనర్ శివనాగిరెడ్డి, కోకన్వీనర్, జాన్‌బాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. సాగునీటి సంఘం నాయకులు శేషాద్రిరెడ్డి, రిటైర్డ్ ఎకానమీ ప్రొఫెసర్ ఎస్‌ఏ రహమాన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు లాజరస్ తదితరులు కూటమి సర్కారు ప్రతీది ప్రైవేట్ పరం చేస్తుందని, కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పీపీపీ పద్ధతిలో మెడికల్
కాలేజీల నిర్మాణానికి వ్యతిరేకం