
కనుల పండువగా మంచాలమ్మ తెప్పోత్సవం
మంత్రాలయం : ఓవైపు వేద మంత్రాల ఘోష, మరో వైపు మంగళవాయిద్యాల సుస్వరాలు.. ఇంకోవైపు భక్తజనుల హర్షధ్వానాల మధ్య గ్రామదైవం మంచాలమ్మ గ్రామోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సబుధేంద్రతీర్థులు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ముందుగా అమ్మవారిని శ్రీమఠం ఈశాన్య భాగంలోని పుష్కరిణి వరకు మంగళవాయిద్యాలతో తీసుకెళ్లారు. పుష్కరిణి మంటపంలో శాస్త్రోక్తంగా పీఠాధిపతి పూజలు చేపట్టారు. పీఠాధిపతి ప్రవచనం అనంతరం అమ్మవారిని తెప్పపై ఆశీనులను గావించారు. వేదమంత్రోచ్ఛారణ పఠిస్తూ సుందరంగా అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రభపై అమ్మవారిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవ వేడుకలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
డోన్ టౌన్: డోన్ పాత బస్టాండ్ నుంచి పాతపేట మార్గంలో ఉన్న కర్నూలు రైల్వే గేట్ల సమీపంలో రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి (38) మృతి చెందినట్లు రైల్వే జీఆర్పీ ఎస్‌ఐ బిందుమాధవి తెలిపారు. కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న డెమో రైలు మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో డోన్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుడి చేతిపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు, ఎడమ భుజంపై ‘శివమణి’ అనే పచ్చబొట్టు ఉన్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 90304 81295 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.