
పత్తి రైతు చిత్తు
● నకిలీ విత్తనాలతో కిలో దిగుబడి కూడా రాని వైనం
ఈ చిత్రంలోని రైతు పేరు గొల్ల వెంకటలింగం. ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామానికి చెందిన పత్తి రైతు. నందికొట్కూరులోని భ్రమరాంబ మల్లికార్జున సీడ్స్ దుకాణంలో ఈ ఏడాది జూన్ 6వ తేదీన రాయల్ సీడ్స్ కంపెనీకి చెందిన రణధీర్ బీజీ–2 రకం పత్తి విత్తనాలు (475 గ్రాములు) ప్యాకెట్ రూ.850 ప్రకారం 11 ప్యాకెట్లు కొని మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మందులు తదితర వాటికి పెట్టుబడిగా రూ.లక్షకుపైగా పెట్టాడు. ఇప్పటికే పత్తి సాగు చేసిన రైతులు మొదటి విడత పత్తి తీసి.. రెండో దఫా కూడ పత్తి తీయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రైతు సాగు చేసిన పత్తిలో మాత్రం ఇంతవరకు కిలో పత్తి కూడా తీయలేదు. పూత వచ్చినప్పటికి చెట్టుపైనే వాడిపోయి రాలిపోతోంది. అక్కడక్కడ కాయలు వచ్చినా...కుళ్లి పోతున్నాయి. దిగుబడి పెంచుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఫలితం లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులకు తన అవస్థ చెప్పుకునేందుకు మంగళవారం కుమారుడు హరికృష్ణతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే సెలవు దినం కావడం.. అధికారులెవ్వరూ కనిపించకపోవడంతో విలేకర్లకు తన గోడు చెప్పుకొని కన్నీరుమున్నీరయ్యాడు. నకిలీ పత్తి విత్తనాలు ఇవ్వడంతోనే తనకు నష్టం జరిగిందని, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పరిహారం ఇప్పించాలని కోరారు.