
ప్రలోభాలతో మోసం చేయడం తగదు
కోసిగి: కూటమి నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి సామాన్య ప్రజలను ప్రలోభాలతో మోసం చేయడం తగదని వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు విభాగం నాయకులు నరసింహులు గౌడ్, గ్రామ సర్పంచ్ మునెమ్మలు విమర్శించారు. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన 90 కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరినట్లు హడావుడి చేయడం తగదన్నారు. మంగళవారం కామన్‌దొడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్ మునెమ్మ ఆధ్వర్యంలో ఎవరైతే పార్టీ వీడారని చెప్పారో వారే తిరిగి గ్రామానికి చెందిన హరిజన అడివప్ప, యల్లప్ప, అబ్రహం, పరమేష్, దాసరి అంజినయ్య, పింజారి బాషా, రహిమాన్, ఉసేనిలతో పాటు మరో 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులు ఇంటి స్థలం మంజూరుపై మాట్లాడేందుకు పిలిపించి తమకు పార్టీ కండువాలు వేశారన్నారు. అంతేకానీ పార్టీ కండువాలు వేస్తారంటే వెళ్లే వాళ్లం కాదన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వెంటే ఉంటామని, వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. ఎవరూ కూటమి నాయకుల ప్రలోభాలకు గురికావద్దన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బషీర్, నాయకులు పాల్గొన్నారు.