గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జీడీపీలో ప్రస్తుతం 4.1 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు నాలుగో క్రస్ట్ గేటు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని హంద్రీనదిలోకి విడుదల చేశారు. జీడీపీ ఎగువ ప్రాంతం నుంచి 3వేల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.
శనగ విత్తనాలకు అడ్డగోలు ధర
● కిలో ధర రూ.78.. సబ్సిడీ 25 శాతమే
కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్‌లో కిలో శనగల ధర గరిష్టంగా రూ.55 వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం రబీ సీజన్ కోసం సబ్సిడీపై పంపిణీ చేసే పప్పు శనగలకు మార్కెట్ ధర కంటే తక్కువ ఉండాలి. అప్పుడే రైతులు సబ్సిడీ విత్తనాలపై ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధిక ధర నిర్ణయించి సబ్సిడీ మాత్రం 25 శాతానికే పరిమితం చేయడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే శనగ విత్తనాలు కిలో ధరను రూ.78గా నిర్ణయించింది. కిలోకు 25 శాతం సబ్సిడీ (రూ.19.50) ఉంటుంది. సబ్సిడీ పోగా రైతులు కిలోకు రూ.58.50 చెల్లించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఇంతకంటే తక్కువ ధరకు లభిస్తుండటంతో సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు 33 నుంచి 40 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ చేసింది. అక్టోబర్ 3 నుంచి శనగ విత్తనాలు పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
57 విలేజ్ క్లీనిక్స్ మంజూరు
కర్నూలు(అర్బన్): జిల్లాకు కొత్తగా 57 విలేజ్ క్లీనిక్స్ మంజూరైనట్లు పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు ఐ.వేణుగోపాల్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్(పీఎంఏబీహెచ్‌ఐఎం) నిధులతో ఈ విలేజ్ క్లీనిక్స్ భవనాలను నిర్మిస్తామన్నారు. త్వరలోనే ఈ భవన నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో జిల్లాకు వైఎస్సార్ హెల్త్ క్లీనిక్స్ 354 మంజూరయ్యాయని, వీటిలో 135 భవన నిర్మాణాలను పూర్తి చేసి వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించామన్నారు. రూఫ్ లెవెల్, రూఫ్ లెయిడ్ దశలో ఉన్న 76 భవన నిర్మాణాలను నేషనల్ హెల్త్ మిషన్ కింద పూర్తి చేస్తామన్నారు. బిలో బేస్‌మెంట్, బేస్‌మెంట్ లెవెల్‌లో ఉన్న మరో 30 భవన నిర్మాణాలను కూడా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నిధులతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులకు త్వరలో టెండర్లను పిలుస్తామన్నారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద నేడు నిరసన
కర్నూలు (టౌన్): ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు పాతబస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపడుతున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసనలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల అనుబంధ విభాగాలతో పాటు దళిత సామాజిక వర్గ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని నిరసనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
35,064 ఎకరాల్లో
పంట నష్టం
కర్నూలు(అగ్రికల్చర్): ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల జిల్లాలో 35,064 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలు 34,635 ఎకరాలు, ఉద్యాన పంటలు 429 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. 14,169 మంది రైతులు అధిక వర్షాల వల్ల పంటలను నష్టపోయారు. ఈ నెల 12 నుంచి 29వ తేదీ వరకు కురిసిన వర్షాల ప్రభావం చిప్పగిరి, ఆదోని, కౌతాళం, తుగ్గలి, మద్దికెర, కర్నూలు, కల్లూరు, ఆస్పరి, కోసిగి, మంత్రాలయం, దేవనకొండ, దేవనకొండ మండలాల్లోని 119 గ్రామాలపై ఉంది. అత్యధికంగా పత్తి 31,665 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఉద్యాన పంటల్లో మిర్చి, బొప్పాయ పంటలకు నష్టం వాటిల్లింది. కాగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 18 మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంత్రాలయంలో 28.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 206.6 మి.మీ వర్షపాతం నమోదైంది.