
బారులు తీరి.. సమస్యలు నివేదించి!
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీఆర్‌ఎస్)లో అర్జీలు అందించేందుకు ప్రజలు బారుతీరి కనిపించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కాలేకపోయారు. వారి తరఫున కింది స్థాయి అధికారులను పంపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి వచ్చి అర్జీలు స్వీకరించారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను తన కార్యాలయానికి పిలుపించుకున్నారు. ఈ క్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, హౌసింగ్ పీడీ చిరంజీవిలు మాత్రమే ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఎన్నో ఆశలతో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు తీవ్ర నిరాశ చెందారు.
ఇవీ సమస్యలు..
● తన తల్లిదండ్రులు 20 ఏళ్ల క్రితం లక్ష్మీపురంలో రెండు ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారని, అందుకు సంబంధించి అన్నీ ఆధారాలు ఉన్నా పొలాన్ని అమ్మిన వారి మనువళ్లు భయపెడుతున్నారని, న్యాయం చేయాలని అడ్వొకేట్ నంద్యాల ఉమేష్ కుమార్ అర్జీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న రవికుమార్ భయపెడుతన్నారని అర్జీలో పేర్కొన్నారు.
● తాను దివ్యాంగుడి అని.. తనకున్న 2.50 ఎకరాల భూమిని చుట్టుపక్కల వాళ్లు ఆక్రమించారని, దానిని సర్వే చేసి చూపాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మద్దికెర గ్రామానికి చెందిన కాలువ శ్రీరాములు అర్జీ ఇచ్చారు. వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ చిన్న షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాని, భూమిని సర్వే చేసి న్యాయం చేయాలని అర్జీలో పేర్కొన్నారు.