
పీజీఆర్‌ఎస్‌కు 79 ఫిర్యాదులు
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు మొత్తం 79 ఫిర్యాదులు వచ్చాయి. కర్నూలు నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ను ఎస్పీ విక్రాంత్‌పాటిల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్‌పీ హుసేన్‌పీరా కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.
ఉద్యోగాల పేరుతో మోసం
ఎయిడెడ్ స్కూల్‌లో టీచర్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన మాధవప్ప రూ.14.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు ఎల్ వెంకయ్య నగర్‌కు చెందిన దొరస్వామి ఫిర్యాదు చేశారు. చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
మార్కెట్ యార్డుకు మూడు రోజుల సెలవు
కర్నూలు(అగ్రికల్చర్): విజయ దశిమి పర్వదినం సందర్భంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ నెల 30 నుంచి అక్టోబర్ నెల 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ యార్డు సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 30న దుర్గాష్టమి, 1న ఆయుధపూజ, 2న విజయ దశిమి పండగలు ఉన్నందున మూడు రోజుల్లో మార్కెట్‌లో ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగవని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలని కోరారు.