
జీఎస్టీ తగ్గింపుపై విస్తృత ప్రచారం
కర్నూలు(సెంట్రల్): జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) తగ్గింపుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపుపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. తగ్గింపుతో ఒక్కో కుటుంబానికి నెలకు కనీసం రూ.1000 వరకు ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని తెలపాలన్నారు. దుకాణాల్లో పాత ఎమ్మార్పీ ధరలకే నిత్యావసర వస్తువులను అమ్ముతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తూనికలు–కొలతలు, వాణిజ్య పన్నులు, పౌరసరఫరాల శాఖలు ఆకస్మిక తనిఖీలు చేసి నిర్ధారించాలన్నారు. జీఎస్టీ తగ్గింపుపై వ్యవసాయ శాఖ, డీఆర్‌డీఏ, మెప్మా, విద్యాశాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు వ్యాసర చన, వక్తృత్త పోటీలను నిర్వహించాలని, ఆయా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, కమర్షియల్ ట్యాక్స్ జేసీ నీరజ పాల్గొన్నారు.