
సమస్యలు తలెత్తితే నేరుగా కలవండి
● జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు: పదవీ విరమణ అనంతరం రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా తనను కలవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. సుదీర్ఘ కాలం పోలీసు శాఖలో పనిచేసి ఆర్మ్‌డ్ రిజర్వుడు విభాగం డీఎస్‌పీ భాస్కర్‌రావు, వెల్దుర్తి పీఎస్ ఏఎస్‌ఐ శివరామిరెడ్డి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ వారికి శాలువా, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందిజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ అనంతరం శేష జీవితం కుటుంబ సభ్యులతో సుఖంగా గడపాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్‌పీరా, కర్నూలు డీఎస్‌సీ బాబు ప్రసాద్, సీఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, శివశంకర్, గుణశేఖర్‌బాబు, వేణుగోపాల్, ఆర్‌ఐలు జావేద్, నారాయణ, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు సుమారు 40 ఏళ్ల వయస్సు, ఐదున్నర అడుగుల ఎత్తు కలిగిన వ్యక్తి, ఆదివారం రాత్రి పెట్రోల్‌బంకు సర్కిల్ నంద్యాల బస్సు స్టాప్ షెల్టర్ సమీపంలో ఉన్న స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని కాపాడేందుకు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్ కలర్, హాఫ్ టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ ఫుల్‌షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్ ధరించినట్లు సీఐ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశామని, మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01124కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.
నాటుసారా కట్టడికి ప్రత్యేక బృందాలు
ఆలూరు రూరల్: దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు, ఉత్సవాల రోజు మద్యం అమ్మకాలను అరికట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి తెలిపారు. దేవరగట్టు కొండల్లో సోమవారం ఆలూరు సీఐ లలిదాదేవి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బన్ని ఉత్సవాల్లో నాటుసారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు 69 మంది నాటు సారా తయారీ, విక్రయదారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఆలూరు ఎకై ్సజ్ పరిధిలోని 5 మండలాల్లో నాటుసారా వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఐ నవీన్ కుమార్ పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఇంజినీరింగ్ అధికారులకు సెలవులు రద్దు
కర్నూలు (టౌన్): దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 16వ తేదీ కర్నూలు నగరంలో పర్యటిస్తున్నందున నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఇంజినీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయాల ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వచ్చే నెల 7 వ తేదీ లోపు పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధిచిన వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్ (డెమో)గా ఎన్.ప్రకాష్‌రాజు నియమితులయ్యారు. గుంటూరులోని పీఓడీటీటీలో పనిచేస్తున్న ఆయన్ను పదోన్నతిపై కర్నూలుకు బదిలీ చేశారు. ఇక్కడ ఇన్‌చార్జ్ డెమోగా ఉన్న పి.శ్రీనివాసులుశెట్టిని కర్నూలులోని రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)లో కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఆయనతో పాటు రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (ఫిమేల్) సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎ.నిర్మలమ్మను తిరుపతిలోని ఎస్‌వీఎంసీలో ఉన్న ప్రసూతి హాస్పిటల్‌కు బదిలీ చేశారు.

సమస్యలు తలెత్తితే నేరుగా కలవండి

సమస్యలు తలెత్తితే నేరుగా కలవండి