
అనంతపురం – అమరావతి రహదారి అలైన్‌మెంట్ ఖరారు
● ఆమోదం తెలిపిన కేంద్రం
● అలైన్‌మెంట్‌లో మార్పులు కోరిన
జెడ్పీచైర్మన్
కొలిమిగుండ్ల: అనంతపురం–అమరావతి 544–డీ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి అలెన్‌మెంట్ దాదాపుగా ఖరారు అయ్యింది. అనంతపురం నుంచి బుగ్గ వరకు రెండు ప్యాకేజీల కింద చేపడుతున్న హైవే పనులు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా సరిహద్దు నుంచి గిద్దలూరు వరకు 135 కి.మీ మేర జాతీయ రహదారి నిర్మాణం కోసం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల అలైన్‌మెంట్‌కు ఆమోదముద్ర వేసింది. జిల్లా సరిహద్దు నుంచి కొలిమిగుండ్ల మండలంలో మీదుగా ఈ హైవే సాగనుంది. అలైన్‌మెంట్‌లో చిన్న మార్పులు చేసేందుకు సోమవారం ఎన్‌హెచ్‌ఏఐ సైట్ ఇంజినీర్ సుశాంత్, బెంగళూరుకు చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధి భరత్‌తో పలు అంశాలపై క్షేత్ర స్థాయిలో చర్చించారు. జిల్లా సరిహద్దు నుంచి మండల కేంద్రం వరకు పలు చోట్ల అలైన్‌మెంట్ మార్పులు చేసే వాటిపై ఆయా ప్రాంతాలను చూపించి వివరించారు. మార్పులకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారి చెప్పారు. 2017లో చేసిన అలైన్‌మెంట్ ప్రకారమే ఎలాంటి మార్పులు లేకుండా మండలంలో జాతీయ రహదారి నిర్మాణం జరుగనుంది. అతి త్వరలోనే డీపీఆర్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెండర్లు పిలిచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అలైన్‌మెంట్‌లో తప్పక మార్పులు చేపట్టాలి..
అనంతపురం–అమరావతి జాతీయ రహదారి నిర్మాణం జరిగితే రవాణ సదుపాయం మెరుగుపడుతుండటం సంతోషకరమని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల మండలంలో అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఆమోదం చేసిన అలైన్‌మెంట్ ప్రకారం జిల్లా సరిహద్దు నుంచి కొలిమిగుండ్ల క్రాస్ రోడ్డు వరకు గ్రామాల్లోనే హైవే వస్తుంది. దీని వల్ల ఆయా గ్రామాల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అంకిరెడ్డిపల్లె, రాఘవరాజుపల్లె, కనకాద్రిపల్లె, ఇటిక్యాల గ్రామాల్లో కాకుండా వెలుపల బైపాస్ నిర్మించాలని ఆయన కోరారు. ఈ విషయంపై ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారులను కోరుతామన్నారు. గ్రామాల్లో కాకుండా వెలుపల బైపాస్ చేపడితే నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు దూరం తగ్గుతుందన్నారు. ప్రధానంగా సిమెంట్, పవర్‌గ్రిడ్ తదితర పరిశ్రమలకు అనుకూలంగా మారుతుందన్నారు.