డిగ్రీ కళాశాలల మూత మంత్రి లోకేష్‌కు కనిపించదా? | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ కళాశాలల మూత మంత్రి లోకేష్‌కు కనిపించదా?

Sep 29 2025 8:20 AM | Updated on Sep 29 2025 8:20 AM

డిగ్రీ కళాశాలల మూత మంత్రి లోకేష్‌కు కనిపించదా?

డిగ్రీ కళాశాలల మూత మంత్రి లోకేష్‌కు కనిపించదా?

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

ఎస్వీ మోహన్‌ రెడ్డి

కర్నూలు (టౌన్‌): ‘జిల్లాలో ఈనెల 22వ తేదీన డిగ్రీ కళాశాలలు మూత పడ్డాయి. ఇప్పటికి వారం రోజులు అవుతుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు కనిపించదా’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్‌పార్టీ నుంచి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన లక్కీ 2 బ్రదర్స్‌ రాంపుల్లయ్య యాదవ్‌, నరసింహులు యాదవ్‌, లోక్‌నాథ్‌ యాదవ్‌, 50వ వార్డు కార్పొరేటర్‌ మౌనిక రెడ్డిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పాలన అన్ని రంగాల్లో విఫలం చెందిందన్నారు. ఫీజురీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించాలని వారం రోజుల క్రితం డిగ్రీ కళాశాలలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా స్పందన లేదన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి కళాశాలలు మూత పడి విద్యార్థులు రోడ్డున పడ్డారన్నారు. అయినా మంత్రి లోకేష్‌ స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల వ్యవధిలో రూ. 2 50 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. రూ. లక్ష కోట్లు పెట్టి అమరావతికి నిర్మిస్తున్నారన్నారు. కనీసం రూ.350 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లిస్తే విద్యార్థుల చదువులకు అటంకం ఉండేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనానికి ఇదే నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన లక్కీ 2 బ్రదర్స్‌తో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు.

పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : లక్కీ 2 బ్రదర్స్‌

వైఎస్సార్‌సీపీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని కేడీసీసీ మాజీ డైరెక్టర్‌, గొర్రెల పెంపకం దారుల సహకారం సంఘం ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్‌ రాంపుల్లయ్య యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌, స్టాండింగ్‌ కమిటీ మాజీ సభ్యులు నరసింహులు యాదవ్‌ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక, నగర అధ్యక్షుడు అహమ్మద్‌ ఆలీఖాన్‌, కార్పొరేటర్‌ విక్రమసింహారెడ్డి, పార్టీ నాయకులు షరీఫ్‌, రాఘవేంద్ర, శ్రీనివాసరెడ్డి, కిషన్‌, పాటిల్‌ తిరుమలేశ్వరరెడ్డి, ఖలీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement