
సంక్షేమాన్ని వదిలేసి ప్రతీకారంతో పాలన
మంత్రాలయం: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి పగలు, ప్రతీకారాలతో పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం స్వగ్రామం రాంపురంలో తన నివాసంలో వైఎస్సార్‌సీపీ డిజిటల్ బుక్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ ‘రెడ్‌బుక్’ ఆగడాలకు భవిష్యత్తులో తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని పాలన చేయడం శోచనీయమన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పర్యావసనాలు నోట్ చేసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్‌ను అమల్లోకి తీసుకువచ్చారన్నారు. ఈ బుక్‌లో రెడ్‌బుక్ బాధితుల వివరాలు, జరిగిన నష్టాలను పొందు పర్చేందుకు వీలు ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఈ బుక్ భవిష్యత్తులో తోడుగా ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త డిజిటల్ బుక్‌ను వినియోగించుకోవాలని సూచించారు. టీడీపీ శ్రేణుల ఆగడాలను ప్రతిదీ ఇందులో నోట్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి ఈరన్న, అగసనూరు అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రాలయం ఎమ్మెల్యే
వై.బాలనాగిరెడ్డి
వైఎస్సార్‌సీపీ డిజిటల్ బుక్
ఆవిష్కరణ