లాఠీ.. దారి తప్పుతోంది! | - | Sakshi
Sakshi News home page

లాఠీ.. దారి తప్పుతోంది!

Sep 29 2025 8:20 AM | Updated on Sep 29 2025 8:20 AM

లాఠీ.. దారి తప్పుతోంది!

లాఠీ.. దారి తప్పుతోంది!

చేతిలో లాఠీ... నెత్తిన టోపీ... ఒంటి మీద ఖాకీ... వీటి పేరు చెబితే చాలు.. పోలీసు గుర్తొస్తాడు. నేరస్తులను పట్టుకుని బుద్ధి చెప్పడమే కాదు.. వారిని దారిలో పెట్టాల్సింది పోలీసే. అందుకు పోలీసులకు అధికారమే కాదు, బాధ్యత ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పోలీసులే తప్పు చేస్తూ పోతే.. ప్రజలకు ఆ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. లాఠీయే దారి తప్పిందని తెలిస్తే నేరస్తులకు కొమ్ములు వస్తాయి. దురదృష్టవశాత్తు జిల్లాలో కొందరు పోలీసులు క్రమశిక్షణ తప్పి శాఖ పరువు తీస్తున్నారు. ఇటీవల కాలంలో పదేపదే ఖాకీ కథలెన్నో వెలుగులోకి వస్తుండటంతో సామాజిక మాధ్యమాల్లోనే కాదు.. సామాన్య ప్రజానీకంలోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

కర్నూలు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే దారితప్పుతున్నారు. సంపాదన కోసం తమ పరిఽఽధిలను అతిక్రమించి జైలుపాలవుతున్న సంఘటనలు ఆ శాఖకు మచ్చగా మిగులుతున్నాయి. ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరించి వసూళ్లకు పాల్పడిన ముఠా సభ్యులకు సహకరించి ఇటీవలే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు సస్పెన్షన్‌కు గురయ్యారు. కరుడుగట్టిన నేరస్తుడు రౌడీషీటర్‌ శరీన్‌ నగర్‌కు చెందిన నాగేంద్ర అరాచకాలకు బ్లూ కోల్ట్స్‌ సిబ్బంది అండగా నిలిచి జైలుపాలయ్యారు. ఏకాంతంగా గడిపే జంటలపై దాడి చేసి నగలు, నగదు దోచుకోవడంతో పాటు యువతులపై గోర్లగుట్ట నాగేంద్ర అత్యాచారాలకు పాల్పడేవారు. నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం బ్లూ కోల్ట్స్‌ సిబ్బందికి తెలిసినప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోనందుకు వారు శాఖాపరమైన చర్యలకు గురయ్యారు. అలాగే కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృపానందం విజయవాడకు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ జగదీష్‌తో చేతులు కలిపి ఇళ్ల దొంగతనాలకు పాల్పడి జైలుపాలు కావడం తాజాగా పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

క్రైం పార్టీ ముసుగులో...

పోలీసు శాఖ అంటే క్రమశిక్షణకు మారుపేరు. చట్టాలకు లోబడి పనిచేయాల్సిన కొందరు కాసుల రుచి మరిగి అక్రమార్కులకు సహకరించడం, అక్రమ వ్యవహారాల్లో తల దూర్చి శాఖాపరమైన చర్యలకు గురవుతున్నారు.

● క్రైం పార్టీ ముసుగులో కర్నూలు అర్బన్‌ తాలూకా, నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఏఎస్‌ఐ, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లపై ఇటీవల బదిలీ వేటు పడింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేవారికి సహకరించారన్న నిఘా విభాగం నివేదిక మేరకు వారిని జిల్లా సరిహద్దు స్టేషన్లకు బదిలీ చేసినప్పటికీ రాజకీయంగా ఉన్నతాధికారులతో వారికున్న పలుకుబడిని ఉపయోగించి అనతి కాలంలోనే యథా స్థానాలకు వచ్చి దందాలు కొనసాగిస్తున్నారు.

● నగరంలో కొందరు పోలీసులకు గంజాయి స్మగ్లర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలతో వెలుగు చూసినా చర్యలు లేకపోవడంతో ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

● విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఏఎస్‌ఐ పట్ల మద్యం మత్తులో పట్టపగలే దురుసుగా ప్రవర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ బదిలీ వేటుకు గురయ్యా రు. బాధితురాలు స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చి అప్పట్లో చర్చనీయాంశమైంది.

● కేసుల్లో సీజ్‌ చేసిన బైకులు పోలీస్‌స్టేషన్‌లో ఉంచుతారు. వాటికి అమ్మి సొమ్ము చేసుకుందామని కోడుమూరు పీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ జగదీష్‌కు దుర్బుద్ధి పుట్టింది. పట్టుబడిన ఐదు బైకులను ఒక్కొక్కటిగా విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యాడు.

● పాత కేసును తిరగదోడి ఓ చిరు వ్యాపారిని బెదిరించి ఓ సీఐ, కానిస్టేబుల్‌ ఇటీవల ఏసీబీకి పట్టుబడి జైలుపాలయ్యారు.

● పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ నుంచి సీఐ వరకు కొంతమంది ప్రైవేటు, చిట్‌ఫండ్స్‌తో పాటు ఫైనాన్స్‌ వడ్డీ వ్యాపారుల్లో భాగస్వాములుగా ఉంటున్నారు.

● కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో తెరచాటుగా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చట్ట రీత్యా నేరం. ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి సహకరించడమే కాక మరికొందరు దొంగలతో దోస్తీ కట్టి జైలుపాలు కావడం పోలీసు శాఖలో హాట్‌ టాపిక్‌గా మారింది.

పలు నేరాల్లో వెలుగులోకి వస్తున్న

పోలీసుల పాత్ర

లోపాయికారికంగా మరుగున

పడుతున్న ఘటనలు మరికొన్ని

పోలీసు శాఖలో పెరుగుతున్న ఆగడాలు

పట్టు తప్పుతున్న క్రమశిక్షణ

వీఆర్‌కు పంపుతున్నా తీరు మార్చుకోని

కొందరు ఖాకీలు

జిల్లా పోలీసు శాఖను

గాడిలో పెట్టాల్సిన సమయమిది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement