
కాళరాత్రి దుర్గగా కామేశ్వరి దేవి
నందవరంలో...
బనగానపల్లె రూరల్: దసరాశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారు ఆదివారం కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజల్లో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. బనగానపల్లె పట్టణంలోని కొండపేట శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలోని శ్రీగాయత్రిదేవి అమ్మవారు శ్రీమహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
ప్రత్యేక అలంకారంలో లక్ష్మమ్మవ్వ
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో శరన్నవ రాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. ఏడోరోజు ఆదివారం అమ్మవార్లు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేరుశనగ విత్తనాలు, రాజ్మా విత్తనాల అలంకారంలో ఆదోని ఇలవేల్పు శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
మహాచండీగా మంచాలమ్మ
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయ క్షేత్రంలో గ్రామ దేవత మంచాలమ్మ మహాచండీగా దర్శనమిచ్చారు. రజత కవచధారణలో పులిపై కొలువుదీరిన మంచాలమ్మ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
మహానంది: శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారు కాళరాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి శ్రీ కాళరాత్రి దుర్గగా దర్శనం ఇచ్చారు. శ్రీ కాళరాత్రి రూపంలో అమ్మవారిని ఉపాసించడం ద్వారా సమస్త పాపాలు, విఘ్నాలు తొలగిపోతాయని వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. గ్రహబాధలు ఉండవని, శత్రు, జంతు భయాలు ఉండవన్నారు. స్థానిక అలంకార మండపంలో ముందుగా అమ్మవారికి అలంకార పూజలు, అష్టవిధ మహామంగళ హారతులు ఇచ్చారు. వర్షం కారణంగా గ్రామోత్సవం రద్దు చేసినట్లు ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి చెప్పారు. పూజా కార్యక్రమంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్లు ఎం. నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, ఆలయ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

కాళరాత్రి దుర్గగా కామేశ్వరి దేవి

కాళరాత్రి దుర్గగా కామేశ్వరి దేవి

కాళరాత్రి దుర్గగా కామేశ్వరి దేవి