
శనగ విత్తనాల పంపిణీ ఇంకెప్పుడు!
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ మరో రెండు రోజుల్లో మొదలు అవుతోంది. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే ఇంతవరకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ ఊసే లేకుండా పోయింది. అటు నంద్యాల జిల్లాలో శనగ (బెంగాల్‌గ్రామ్) ప్రధాన పంట. శనగ విత్తనాల కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. రబీ సీజన్‌లో ఇటు కర్నూలు జిల్లాలో రబీలో 70 వేల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 50 వేల హెక్టార్ల ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.20 లక్షల హెక్టార్లలో సాగు అవుతుంది. రబీ సీజన్‌కు కూటమి ప్రభుత్వం సాగు విస్తీర్ణాన్ని, డిమాండ్‌ను, గత ఏడాది పంపిణీ చేసిన దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా అరకొరగా శనగ విత్తనాలు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరును పరిశీలిస్తే సబ్సిడీ విత్తనాల పంపిణీకి మంగళం పలికే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలు కేటాయించక పోవడంతో రైతుల ఆందోళన వ్యక్తం అవుతోంది. 2024–25 రబీ, 2025–26 ఖరీఫ్ సీజన్‌లో పంపిణీ చేసిన విత్తనాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏపీసీడ్స్‌కు సబ్సిడీ సొమ్ములో రూపాయి కూడా చెల్లించలేదు. రూ.120 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్గనైజర్లు ప్రస్తుత రబీ సీజన్‌కు శనగ విత్తనాల సరఫరాకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.
12,371 క్వింటాళ్ల కోత...
రబీలో శనగ సాగుకు కర్నూలు జిల్లాకు 46 వేలు, నంద్యాల జిల్లాకు 25 వేల క్వింటాళ్ల ప్రకారం ఉమ్మడి జిల్లాకు 71 వేల క్వింటాళ్లు శనగ విత్తనాలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. ఈ మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యవసాయ యంత్రాంగం కూడా ప్రభుత్వానికి నివేదించింది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా కర్నూలు జిల్లాకు 23,897 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 12,564 క్వింటాళ్ల ప్రకారం 36,461 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. ఈ విత్తనాలు ఏ మాత్రం సరిపోవని వ్యవసాయ అధికారులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గత రబీలో కర్నూలు జిల్లాలో 29,967 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 18,865 వేల క్వింటాళ్ల ప్రకారం 48,832 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. గత ఏడాది రబీతో పోలిస్తే కర్నూలు జిల్లాలో 6,070 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 6,031 క్వింటాళ్ల శనగ విత్తనాలకు కూటమి ప్రభుత్వం కోత విధించింది. ఏకంగా ఉమ్మడి జిల్లాలో 12,371 క్వింటాళ్లకు కోత పెట్టడంతో ఈ సారి రబీల్లో శనగ విత్తనాలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు వ్యవసాయ అధికారులే పేర్కొంటున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ముందస్తుగానే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లు సీజన్‌కు ముందే విత్తనాల పంపిణీ చేపట్టింది. రబీ సీజన్ అక్టోబరు 1 నుంచి మొదలవుతుంటే సెప్టెంబరు 20 నుంచే విత్తనాల పంపిణీ జరిగేది. ముందస్తుగా రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం వల్ల వర్షాలు పడినపుడు అదునులో విత్తుకోవడం జరిగేది. కూటమి ప్రభుత్వం గత ఏడాది రబీలో ఆలస్యంగా విత్తనాల పంపిణీ చేపట్టింది. ఈ సారి కూడా జాప్యం చేస్తుండటంతో రైతుల ఆందోళన అంతా.. ఇంతా కాదు. ఆలూరు సబ్ డివిజన్‌లో శనగ ముందస్తుగా సాగు చేస్తారు. ఇంతవరకు విత్తనాల పంపిణీ ఊసే లేకుండా పోవడంతో రైతులు ప్రయివేటుగా అధిక ధరలతో కొనుగోలు చేసే పరిస్థి తి ఉత్పన్నం అవుతోంది. సాధారణంగా రబీలో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయరు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022–23, 2023–24 సంవత్సరాల్లో రబీలో కూడా వేరుశనగ సబ్సిడీపై పంపిణీ చేసింది. ఈ సారి రబీ సీజన్‌కు కర్నూలు జిల్లాకు వేరుశనగ 4,715 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 449 క్వింటాళ్లు కేటాయించింది. గత ఏడాది రబీలో వేరుశనగ పంపిణీలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ సారి కూడా పంపిణీ చేయడం అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది.
కేటాయింపులో భారీ కోత
ఈ సారి కేవలం
36,371 క్వింటాళ్లు మాత్రమే
సబ్సిడీ విత్తనాల పంపిణీపై
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల
హెక్టార్లలో శనగ సాగుకు అవకాశం
అరకొర విత్తనాలతో
రైతుల్లో ఆందోళన