
సంప్రదాయబద్ధంగా కుమారీ పూజ
శ్రీశైలంటెంపుల్: కుమారిపూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కుమారీపూజలు నిర్వహిస్తున్నారు. ఈ కుమారీపూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి పూజించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
కొండచిలువ పట్టివేత
ప్యాపిలి: జలదుర్గం పరిసర పొలంలో ఆదివారం కనిపించిన పది అడుగుల కొండచిలువను అటవీ అధికారులకు పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండ చిలువను స్థానిక రైతులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న డోన్ ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ ప్రవీణ్ అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ వైల్డ్ లైఫ్ హెడ్ మోహమ్మద్ ఇద్రిస్ కొండచిలువను పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. పాములు పర్యావరణానికి మేలు చేస్తాయన్నారు. పాములను చంపితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం శిక్షార్హులని తెలిపారు. కార్యక్రమంలో రాచర్ల సెక్షన్ ఆఫీసర్ మౌలాలి, బీట్ ఆఫీసర్లు మహేశ్వరి బాయి, శకుంతల తదితరులు పాల్గొన్నారు.
తాగుడుకు బానిసై...
గడివేముల: మండల పరిధిలోని కరిమద్దెల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటుకుంది. ఎస్‌ఐ నాగార్జునరెడి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనకల సుధర్శన్ (20) గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు భార్య బంగారు అమ్మి మద్యం తాగుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం అధికంగా మద్యం తాగి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి చూడగా అప్పటికే మరణించాడు. ఈమేరకు మృతుడి తండ్రి బాలశంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. మృతి చెందిన సుదర్శన్‌కు భార్య, కుమారుడు సంతానం.