
ప్రాణాలు కాపాడిన యువకులు
పత్తికొండ రూరల్: పత్తికొండ –హోసూరు రోడ్డులోని హంద్రీ నీవా కాలువ నీటిలో ప్రమాదవశాత్తు పడి కొట్టుకోపోతున్న యువకుడిని అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి కాపాడారు. వివరాలు ఇలా.. హోసూరు గ్రామానికి చెందిన మాల కల్యాణ్ ఆదివారం ఉదయం హంద్రీనీవా కాలువ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో బస్సు రావడంతో భయపడి పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. అటువైపుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన జయకృష్ణ, హుసేన్ గమనించి వెంటనే నీటిలోకి దూకి కల్యాణ్‌ను ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రాణాలు తెగించి కాపాడటంతో ఆ యువకులను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న హంద్రీ
కల్లూరు: హంద్రీనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు తోడు గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) నుంచి నీరు వదిలారు. దీంతో హంద్రీ నిండుగా ప్రవహిస్తూ జొహరాపురం వద్ద తుంగభద్ర నదిలో కలుస్తోంది. కాగా వరద నీటి ఉద్ధృతితో కల్లూరు దేవనగర్ మధ్యలోనున్న వంతెన నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. హంద్రీ పరిసరాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ప్రాణాలు కాపాడిన యువకులు