
ముంచెత్తిన వాన!
ఆకాశానికి చిల్లుపడినట్లు ఒకటే వాన. రోడ్లన్నీ జలమయం అయ్యి చెరువులను తలపించాయి. చాలా చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. మేఘాలు ముసురు పట్టి చలి తీవ్రత విపరీతంగా పెరిగి వివిధ రోగాలు ప్రబలుతున్నాయి. ఎడతెరపని వర్షంతో అనేక కష్టాలు ప్రజలను గజగజ వణికిస్తున్నాయి.
2,085 హెక్టార్లలో మాత్రమే
పంట నష్టం!
కర్నూలు (అగ్రికల్చర్): అతి భారీ వర్షాలతో జిల్లాలో 2,085 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కర్నూలు, కల్లూరు, ఆస్పరి, ఆదోని, దేవనకొండ మండలాల్లోని గ్రామాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు. పంటలకు అపారమైన నష్టం జరిగినా వ్యవసాయ శాఖ మాత్రం తూతూమంత్రంగా అంచనా వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్)/ నంద్యాల(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జాము 3 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు తెరిపి లేకుండా వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 62 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 16 మండలాల్లో 50 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. గాజులదిన్నె ప్రాజెక్టుకు భారీగా నీరు రావడంతో రెండు గేట్లు ఎత్తి హంద్రీ నదిలోకి విడుదల చేశారు. దేవనకొండ మండలంలో చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. అధిక వర్షాలతో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. పంటలు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. ఆగష్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ. ఉండగా 208.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ ఉండగా 27 రోజుల్లోనే 199.8 మి.మీ. నమోదైంది. కుండపోత వానకు ఈదురు గాలులు తోడు కావడంతో చలి తీవ్రత పెరిగి ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామంలో 30 గొర్రెలు మృతి చెందాయి.
నంద్యాల జిల్లాలో..
కుందూ, మద్దిలేరు, పాలేరువాగులు ఉప్పొంగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ హెచ్చరికలు చేశారు. పంట పొలాలో నీట మునగడంతో రైతులు ఆందోళనలకు గురవుతున్నారు. నంద్యాలలో నందమూరినగర్ వైపు వెళ్లే కుందూ బ్రిడ్జి, రామకృష్ణ పీజీ కళాశాల సమీపంలోని పాలేరు వాగు వద్ద పోలీసులు మోహరించి ప్రజలను అప్రమత్తం చేశారు. శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల నియోజకవర్గాల్లో గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేని వర్షం కురియడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
రైతుకు క‘న్నీరే’ మిగిలింది!
ఈ ఏడాది జిల్లాలో 2.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కాగా.. అధిక వర్షాలతో పగిలిన పత్తికాయలు నేల రాలిపోయాయి. సాధారణంగా ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఇప్పుడు 3 క్వింటాళ్లు కూడా రాని దుస్థితి ఏర్పడింది. పత్తికి వాతావరణ బీమా ఉన్నా ఎకరాకు రూ.2000 ప్రీమియాన్ని రెండు శాతం మంది రైతులు కూడా చెల్లించలేదు. అధిక వర్షాలతో ఉల్లి సాగు చేసిన రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ఈ క్రాప్ నమోదు ప్రకారం జిల్లాలో 52 వేల ఎకరాల్లో ఈ పంట సాగు కాగా నిరంతరం వర్షాలు పడుతుండటంతో దిగుబడి స్పల్పంగా వచ్చింది. అధిక వర్షాలతో టమాట, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతింటున్నాయి. పెట్టుబడి నీళ్లపాలై రైతుకు క‘న్నీరే’ మిగిలింది.
భారీగా దెబ్బతిన్న పత్తి, ఉల్లి,
కంది, టమాట
పొంగిన వాగులు, వంకలు..
స్తంభించిన రాకపోకలు
పెరిగిన చలి తీవ్రత..
30 గొర్రెలు మృతి
రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు
రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడనున్నాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో ఉక్కిరిబిక్కరవుతున్న రైతులు రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు పడుతాయనే సమాచారంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

ముంచెత్తిన వాన!