
న్యాయవాదుల దీక్షకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు
కర్నూలు(సెంట్రల్): కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన దీక్షకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య స్పష్టం చేశారు. హైకోర్టు సాధన కమిటీ సభ్యులు వి.కృష్ణమూర్తి, కె.నాగరాజు, నరసింహులు, జి.రామాంజనేయులు, సింగరాజు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడితోపాటు మేయర్, కోడుమూరు ఇన్‌చార్జి ఆదిమూలపు సతీష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాయలసీమకు మేలు చేసేలా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారన్నారు. అందులో భాగంగా కర్నూలులో జాతీయ న్యాయ యూనివర్సిటీకి శంకు స్థాపన చేశారని, లోకాయుక్తా, హెచ్‌ఆర్‌సీ, వక్ఫ్‌ట్రిబ్యునల్, ఏపీఈఆర్‌సీ, సీబీఐ కోర్టు తదితర కోర్టులను ఏర్పాటు చేశారన్నారు. హైకోర్టును ఏర్పాటు చేసేందు కు నిర్ణయం తీసుకున్నా కోర్టుల అడ్డగింతతో సాధ్యం కాలేదన్నారు. 2029లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి హైకోర్టును ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. దీక్షలో కూర్చున్న బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సుబ్బయ్య, చంద్రుడు, రాజేంద్ర ప్రసాదు, మహేష్, సోమశంకర యాదవ్, ఆనంద్‌కు పూల దండలు వేసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్ష, కార్యదర్శులు సువర్ణారెడ్డి, సత్రాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.