
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
కర్నూలు(సెంట్రల్): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అప్పుడే పర్యాటక అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రూ.14 కోట్లతో ఐదు టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అలవాటు చేసుకోవాలన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడ పిల్లలను కనీసం డిగ్రీ వరకు చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా టూరిజం, డివిజినల్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ యేడాది స్థిరమైన పర్యాటకం, పరివర్తన అనే మోటోను తీసుకొని పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చిన్నారులు చారిత్రక వివరాలు తెలుపుతూ చేసిన నృత ప్రదర్శన, మోహన్‌బాబు చేసిన డాన్సింగ్ డాల్స్ ప్రదర్శనలు, గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, ఆర్‌ఐఓ లాలెప్ప, డీఎస్‌ఓ రాజారఘువీర్, ఎస్‌డీసీలు నాగ ప్రసూన లక్ష్మీ, కొండయ్య పాల్గొన్నారు.