
అక్టోబర్ నుంచి సమ్మెలోకి వెళ్తాం
● కలెక్టరేట్ ఎదుట సచివాలయ
ఉద్యోగుల ఆందోళన
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో అక్టోబర్ నుంచి సమ్మెలోకి వెళ్తామని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు భాస్కరరెడ్డి, శివప్రసాద్, రవి యాదవ్, మగ్బుల్‌హుస్సేన్ హెచ్చరించారు. శనివారం గ్రామ, వార్డు సెక్రటరీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించి కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ముగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను సర్వే పేరుతో క్షేత్ర స్థాయికి పంపి అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ చదువుకు విలువనిచ్చి రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సేవలను తమతో చేయించుకోవాలన్నారు. తమను తమ శాఖల మాతృసంస్థలకు అప్పగించాలని, సమయ పాలనతో పని ఒత్తిడి దూరం చేయాలని కోరారు. అన్ని విభాగాల తరహాలో తమకూ పదోన్నతులు కల్పించాలని, స్టేషన్ సినియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.