
బన్ని ఉత్సవాల్లో హింసకు తావివ్వొద్దు
ఆచారాలను గౌరవిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎ.సిరి
హాజరైన ఆయా శాఖల ఉన్నతాధికారులు
హొళగుంద: దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాల్లో హింసకు తావివ్వకుండా సంప్రదాయలను పాటిస్తూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్‌తో కలిసి దేవరగట్టులో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా కొండ కింద ఉన్న దేవుళ్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలనంతరం వారికి పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏ దేవుడు, ఏ మతం రక్తపాతాన్ని కోరుకోదని.. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తూ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సమావేశానికి హాజరైన ఉత్సవ కమిటీ సభ్యులను, ఆయా గ్రామస్తులను కోరారు. వచ్చే నెల 2న మాళ మల్లేశ్వరస్వామి కల్యాణం, బన్ని ఉత్సవాలను తిలకించేందుకు దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని, వారికి అవసరమైన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు రెండు రోజుల ముందే సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్, డీఎస్పీ వెంకటరామయ్య, జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్, ఎకై ్సజ్ సుపరిటెండెంట్ సుధీర్‌కుమార్, డీపీఓ భాస్కర్, డీఎంహెచ్‌ఓ శశికళ, ఆలూరు సీఐ రవి శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ దిలీప్‌కుమార్, తహసీల్దారు నిజాముద్దీన్, ఎంపీడీఓ విజయలలిత తదితరులు పాల్గొన్నారు.
బన్ని ఉత్సవాల్లో ఆచారాలను గౌరవిస్తామని, రక్తపాతాన్ని ఎంతమాత్రం సహించబోం. అల్లర్లకు పాల్పడే వారితో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తిస్తాం. గతేడాది చెట్టు పైనుంచి పడి పలువురు భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది అలాంటి ఘటనలు పునారావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం. క్షతగాత్రలకు తక్షణ వైద్య సేవలు అందించాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పని చేసేందుకు తాత్కాలిక టవర్లు ఏర్పాటు చెయాలి.
– విక్రాంత్‌పాటిల్, జిల్లా ఎస్పీ

బన్ని ఉత్సవాల్లో హింసకు తావివ్వొద్దు