
మహిళా ఉద్యోగుల సమస్యలకు సత్వర పరిష్కారం
కర్నూలు(అగ్రికల్చర్): మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని, ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. గురువారం సాయంత్రం ఏపీఎన్‌జీవో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా శాఖ నేతలు జిల్లా కలెక్టర్‌ను ఆమె చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని శాఖల్లో మహిళా ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి స్పందిస్తూ ఉద్యోగుల అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి, కర్నూలు నగర శాఖ అధ్యక్షుడు ఎంసీ కాశన్న, జిల్లా అసోషియేట్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి కేసీహెచ్ కృష్ణుడు, మహిళ విభాగం నేతలు పాల్గొన్నారు.
సెలవులో వెళ్లిన జిల్లా ట్రెజరీ అధికారి
● ఏటీవో సుబ్బరాయుడుకు
పూర్తి అదనపు బాధ్యతలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు అనారోగ్య కారణాలతో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇదే కార్యాలయంలో అసిస్టెంట్ ట్రెజరీ అధికారి(ఏటీవోగా పనిచేస్తున్న సుబ్బరాయుడును పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా ట్రెజరీ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన సుబ్బరాయుడును ఏపీటీఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు డి.రవికుమార్, సెక్రటరీ గురుమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీధర్‌నాయుడు, రాష్ట్ర కార్యదర్శి జడ్.కరుణాకర్ పలువురు ట్రెజరీ ఉద్యోగులు అభినందించారు.
తప్పుడు స్టాంపు డ్యూటీ సొమ్ము
రూ.20.26 లక్షల రికవరీ
● అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్‌పై
క్రమశిక్షణా చర్యలు
కర్నూలు(సెంట్రల్): ఆస్తి విలువను తక్కువగా చూపి రూ.20.26 లక్షల స్టాంపు డ్యూటీ మినహాయింపుపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్షమించరాని నేరమని, బాధ్యతాయుత హోదాలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ అలా చేయడంతో అతనికి మూడు సంవత్సరాలపాటు ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయడంతోపాటు రూ.20.26 లక్షలను బాధిత పార్టీల నుంచి ఖజానాకు జమ చేసేలా చర్యలు చేపట్టింది. 2023లో అప్పటి ఆదోని సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ డాక్యుమెంట్ నంబర్ 5352/2023 రిజిస్ట్రేషన్‌కు తక్కువ స్టాంపు డ్యూటీ నమోదు చేసి ఖాజానాకు రూ.20.26 లక్షలు ఆర్థిక నష్టం కలిగించారని లోకాయుక్తకు ఫిర్యాదు రావడంతో ఉప లోకాయుక్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కర్నూలు డీఐజీని విచారణకు ఆదేశించారు. విచారణలో నేరం రుజువు కావడంతో బాధిత పార్టీల నుంచి రూ.20,26,200 వసూలు చేయడమే కాకుండా సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్‌పై క్రమశిక్షణా చర్యల కింద మూడు సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్ల కోత విధిస్తూ లోకాయుక్తకు గురువారం నివేదిక సమర్పించారు. పరిశీలించిన ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ కేసును మూసివేశారు.
హాస్టళ్ల బిల్లులు అప్‌లోడ్ చేయించండి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తయిన పనుల బిల్లులను వెంటనే అప్‌లోడ్ చేయాలని సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఆర్‌డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీరు సీహెచ్ మనోహర్‌ను కలిసి బిల్లుల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 25 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో రూ.7,89,99,000లతో పలు రకాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే చాలా పనులు దాదాపు పూర్తయ్యే దశకు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో చేసిన పనులకు బిల్లులను ఆయా శాఖలు అప్‌లోడ్ త్వరితగతిన బిల్లులు విడుదలయ్యే అవకాశం ఉంటుందన్నారు.

మహిళా ఉద్యోగుల సమస్యలకు సత్వర పరిష్కారం