
‘కన్నీళ్లు’ తుడిచేదెప్పుడు!
● 3,700 మంది రైతులకు మొండిచేయి
● 69,320 క్వింటాళ్లు రైతుల నుంచి నేరుగా కొన్న మార్క్‌ఫెడ్
● ఇప్పటి వరకు 14,491 క్వింటాళ్లకు మాత్రమే రూ.1.54 కోట్ల చెల్లింపులు
● పది రోజులుగా మార్క్‌ఫెడ్ చుట్టూ రైతుల ప్రదక్షిణ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో ఉల్లిగడ్డలు అమ్ముకున్న రైతులకు నగదు చెల్లింపులు ఇప్పటికీ అందని పరిస్థితి. 20 రోజులు గడుస్తున్నా చెల్లింపులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులకు వారం, పది రోజుల్లో నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదు విడుదలవుతుందని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో బాధిత రైతులు మార్క్‌ఫెడ్‌తో పాటు మార్కెటింగ్ శాఖ అధికారుల చుట్టు ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు రైతుల నుంచి మద్దతు ధర రూ.1,200తో నేరుగా కొనుగోలు చేశారు. ఆ తర్వాత నుంచి వ్యాపారులు కొన్న ధర మినహాయించి బ్యాలెన్స్ అమౌంటు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తామన్నారు. 20వ తేదీ వరకు మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ ఉల్లి కొనుగోలు చేసింది. ఆర్థిక బారం తగ్గించుకునేందుకు కూటమి ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోళ్లకు మంగళం పలికి హెక్టారుకు రూ.50 వేల పరిహారం చెల్లిస్తామని ప్రకటించి చేతులు దులిపేసుకుంది.
మద్దతు చెల్లింపులు 250 మందికే..
మార్క్‌ఫెడ్ నేరుగా 1,200 మంది రైతుల నుంచి 69,320 క్వింటాళ్లు మద్దతు ధర రూ.1,200తో కొనుగోలు చేసింది. మరో 2,500 మంది రైతుల నుంచి వ్యాపారులు 90,917 క్వింటాళ్లు కొన్నారు. మద్దతు ధర రూ.1,200 నుంచి వ్యాపారులు కొన్న ధరను మినహాయించి వ్యత్యాసం మొత్తాన్ని మార్క్‌ఫెడ్ రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే 3700 మంది రైతులు మద్దతు ధరతో ఉల్లి గడ్డలు అమ్ముకుంటే ఈ నెల 15వ తేదీ నాటికి కేవలం 250 మంది రైతులకు సంబంధించి 14,491.02 క్వింటాళ్లకు రూ.1,54,35,360 చెల్లింపులు చేయడం గమనార్హం.
రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. ఈ నెల 8న కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 118 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు అమ్మకానికి తీసుకొస్తే వ్యాపారులు క్వింటా రూ.204 ప్రకారం కొన్నారు. మద్దతు ధరలో వ్యత్యాసం రూ.996 ప్రకారం రూ.1,17,528 బ్యాంకు ఖాతాకు విడుదలవుతుందని చెప్పారు. ఈ నెల 5వ తేదీ వరకు బ్యాంకు ఖాతాకు వ్యత్యాసం మొత్తం జమ కాలేదు. రోజూ బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకోవడంతో సరిపోతుంది. – బి.రామలింగడు, దైవందిన్నె,
ఎమ్మిగనూరు మండలం